Telugu Global
Andhra Pradesh

ఎమ్మెల్సీ మెడకు ఉచ్చు బిగుసుకుంటోందా?

చౌళూరి హత్యకు ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాలే కారణమంటూ పార్టీలోని నేతలంతా మండిపోతున్నారు. దానికితోడు ఇక్బాల్ పీఏ గోపీకృష్ణను పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారు. దాంతో ఎమ్మెల్సీ పాత్రపై అనుమానాలు మరింతగా పెరిగిపోయాయి.

ఎమ్మెల్సీ మెడకు ఉచ్చు బిగుసుకుంటోందా?
X

అధికార పార్టీలో విచిత్రమైన పరిస్ధితులు కనబడుతున్నాయి. మామూలుగా అయితే అధికార పార్టీ దెబ్బకు ప్రతిపక్షాలకు చెందిన నేతలు నియోజకవర్గానికి దూరంగా ఉండటం మాములు. కానీ సొంత పార్టీ ఎమ్మెల్సీనే నేతల దెబ్బకు భయపడి దూరంగా ఉంటున్నారంటే ఏమనుకోవాలి? అనంతపురం జిల్లా హిందుపురంలో ఇలాంటి విచిత్రమైన పరిస్ధితే కనబడుతోంది. విషయం ఏమిటంటే అక్టోబర్ 8వ తేదీన హిందుపురం నియోజకవర్గ సమన్వయకర్త చౌళూరి రామకృష్ణారెడ్డి హత్యకు గురయ్యారు.

చౌళూరి హత్యకు ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాలే కారణమంటూ పార్టీలోని నేతలంతా మండిపోతున్నారు. దానికితోడు ఇక్బాల్ పీఏ గోపీకృష్ణను పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారు. దాంతో ఎమ్మెల్సీ పాత్రపై అనుమానాలు మరింతగా పెరిగిపోయాయి. ఎప్పుడైతే హత్య జరిగిందో అప్పటి నుండి ఇక్బాల్ నియోజకవర్గంలోకి అడుగుపెట్టలేదు. ఎమ్మెల్సీ వైఖరికి నిరసనగా నియోజకవర్గంలో నిరసనలు, ఆందోళనలు జరిగాయి. దాంతో ఇక్బాల్ అంటే నియోజకవర్గంలో ఎంత వ్యతిరేకత పెరిగిపోయిందో పార్టీకి అర్ధమైపోయింది.

ఈ నేపథ్యంలోనే కెనడాలో స్ధిరపడిన చౌళూరి సోదరి మధుమతిరెడ్డి వచ్చి నియోజకవర్గంలో కూర్చున్నారు. ఈమె రాక కారణంగా ఎమ్మెల్సీపై పార్టీలోనే కాకుండా మామూలు జనాల్లో కూడా వ్యతిరేకత పెరిగిపోయింది. దాదాపు నెలన్నరగా ఇక్బాల్ నియోజకవర్గంలోకి అడుగే పెట్టలేదు. పార్టీ తరపున ఏ కార్యక్రమం జరుగుతున్నా పాల్గొనలేకపోతున్నారు. నియోజకవర్గంలోకి అడుగుపెడితే ఏమి జరుగుతుందో అన్న భయం కారణంగా బెంగుళూరు, కర్నూలులోనే ఉంటున్నట్లు సమాచారం.

హత్య నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి కూడా ఎమ్మెల్సీపై తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేశారట. నియోజకవర్గం ఇన్‌చార్జి బాధ్యతలను తొందరలోనే మధుమతికి అప్పగిస్తారనే ప్రచారం బాగా పెరిగిపోతోంది. బహుశా ఆమె వచ్చే ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి అయినా ఆశ్చర్యపోవక్కర్లేదు. మొత్తానికి ఇక్బాల్ పరిస్ధితే మరీ అయోమయంలో పడిపోయింది. నియోజకవర్గంలోకి అడుగుపెట్టలేకపోతున్నారు. జగ‌న్‌ను నేరుగా కలవటం కష్టమైపోయిందట. ఎంతకాలం ఇలా బెంగుళూరు, కర్నూలులో తలదాచుకోవాలో ఇక్బాల్‌కు అర్ధం కావటం లేదు. పోలీసు విచారణలో పీఏ ఏమి జరిగిందో చెప్పేస్తే ఇక్బాల్ మెడ చుట్టు ఉచ్చు బిగుసుకోవటం తథ్యమనే ప్రచారం పెరిగిపోతోంది. చివరకు ఏమి జరుగుతుందో చూడాల్సిందే.

First Published:  17 Nov 2022 11:37 AM IST
Next Story