Telugu Global
Andhra Pradesh

చిత్తూరు జిల్లాలో 2 ఘోర ప్రమాదాలు.. 9మంది దుర్మరణం

రెండు చోట్లా డ్రైవర్ల నిర్లక్ష్యం వల్లే ప్రమాదాలు జరిగినట్టుగా తెలుస్తోంది. మరణించిన 9మందిలో ఐదుగురు తిరుమల శ్రీవారి దర్శనం చేసుకుని ఇంటికి వెళ్తున్న భక్తులు.

చిత్తూరు జిల్లాలో 2 ఘోర ప్రమాదాలు.. 9మంది దుర్మరణం
X

ఈ ఉదయం ఉమ్మడి చిత్తూరు జిల్లా రోడ్లు రక్తసిక్తమయ్యాయి. రెండు వేర్వేరు ప్రమాదాల్లో 9మంది మృతి చెందగా మరో ఏడుగురు చావు బతుకుల మధ్య ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. రెండు చోట్లా డ్రైవర్ల నిర్లక్ష్యం వల్లే ప్రమాదాలు జరిగినట్టుగా తెలుస్తోంది. మరణించిన 9మందిలో ఐదుగురు తిరుమల శ్రీవారి దర్శనం చేసుకుని ఇంటికి వెళ్తున్న భక్తులు. తిరుమల యాత్ర ముగిసే లోపు వారి ప్రాణాలు పోయాయి.

ఈ తెల్లవారు ఝామున 3:30 గంటల సమయంలో కేవీ పల్లి మండలం మఠం పల్లి వద్ద తుఫాన్ వాహనం, లారీని ఢీకొనడంతో ఐదుగురు చనిపోయారు. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. కర్నాటకలోని బెల్గాం జిల్లా అత్తిని తాలూకా బడని గ్రామానికి చెందిన 16 మంది భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకుని తిరుగుప్రయాణం అయ్యారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారు. ప్రమాదం జరిగిన సమయంలో వాహనంలో 16 మంది ఉన్నట్టుగా తెలుస్తోంది. క్షతగాత్రులను తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

చిత్తూరు జిల్లాలోనే జరిగిన మరో ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. వీరితో పాటు ప్రయాణించిన మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. చిత్తూరు - తిరుపతి హైవేలో తవణంపల్లి మండలం తెల్లగుండ్ల పల్లి వద్ద ఆగి ఉన్న ట్యాంకర్‌ ను అంబులెన్స్ ఢీకొంది. భువనేశ్వర్‌ కి చెందిన రోగిని బెంగళూరు ఆస్పత్రి నుంచి ఇంటికి తీసుకెళ్తున్నారు. అంబులెన్స్ లో ఏడుగురు ఉండగా నలుగురు స్పాట్ లోనే చనిపోయారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. రోడ్డు పక్కన ట్యాంకర్‌ ను ఆపివేసి ఉంచగా, నిద్ర మత్తులో వేగంగా వెళుతున్న అంబులెన్స్ డ్రైవర్ ట్యాంకర్ ని గమనించకుండా ఢీకొట్టాడు. దీంతో ఈ ప్రమాదం జరిగింది. మృతులంతా ఒడిశా వాసులు.

First Published:  15 Sept 2023 9:11 AM IST
Next Story