Telugu Global
Andhra Pradesh

లోకేశ్ ప్రచార రథాన్ని సీజ్ చేసిన పోలీసులు.. కారణం ఇదే!

నారా లోకేశ్ ఒక చోట యాత్రను ఆపి తన ప్రచార రథం పైకి ఎక్కి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. అనంతరం రథం దిగి ముందుకు వెళ్తుండగా.. ప్రచార రథాన్ని సీజ్ చేస్తున్నట్లు పలమనేరు పోలీసులు ప్రకటించారు.

లోకేశ్ ప్రచార రథాన్ని సీజ్ చేసిన పోలీసులు.. కారణం ఇదే!
X

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ 'యువగళం' పేరుతో ఏపీలో పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. కుప్పంలో ప్రారంభమైన యాత్ర ఈ రోజు చిత్తూరు జిల్లాలోని పలమనేరుకు చేరుకున్నది. పట్టణంలో పాదయాత్ర కొనసాగించిన నారా లోకేశ్ ఒక చోట యాత్రను ఆపి తన ప్రచార రథం పైకి ఎక్కి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. అనంతరం రథం దిగి ముందుకు వెళ్తుండగా.. ప్రచార రథాన్ని సీజ్ చేస్తున్నట్లు పలమనేరు పోలీసులు ప్రకటించారు.

ఎలాంటి అనుమతి లేకుండా బహిరంగంగా మైకులు ఉపయోగించినందుకు కేస్ బుక్ చేసి రథాన్ని సీజ్ చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం ప్రచార రథాన్ని పలమనేరు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. దీంతో నారా లోకేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డుపైనే బైఠాయించి తన నిరసన తెలిపారు. ప్రచార రథం సీజ్ చేయడంపై టీడీపీ శ్రేణులు కూడా మండిపడ్డాయి. నారా లోకేశ్‌తో పాటు వారు కూడా నిరసనకు దిగారు. ఈ క్రమంలో టీడీపీ శ్రేణులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకున్నది.

పోలీస్ స్టేషన్ వద్ద ఉన్న ప్రచార రథం ఎదుటే టీడీపీ నేతలు ఆందోళన చేపట్టారు. సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు కూడా చేశారు. కాగా, తెలుగుదేశం పార్టీ నేతలు లిఖిత పూర్వకంగా హామీ ఇచ్చి, ఇకపై అనుమతి తీసుకుంటామని చెప్పడంతో ప్రచార రథాన్ని పోలీసులు తిరిగి అప్పగించారు. అనంతరం లోకేశ్ తన పాదయాత్రను తిరిగి కొనసాగించారు.

నారా లోకేశ్ కుప్పం నుంచి శ్రీకాకుళం జిల్లా లోని ఇచ్చాపురం వరకు 400 రోజుల పాటు 4వేల కిలోమీటర్ల మేర పాదయాత్ర చేయనున్నారు. ప్రతీ నియోజకవర్గంలో ఒక సభ ఉండేలా ప్లాన్ చేసుకుంటూ వెళ్తున్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలనే ఉద్దేశంతోనే తాను ఈ యాత్ర చేపడుతున్నట్లు ఇప్పటికే లోకేశ్ వెళ్లడించారు.


First Published:  2 Feb 2023 3:36 PM IST
Next Story