డ్రగ్స్ దందా గుట్టు రట్టు - సూడాన్ దేశస్తుడిని అరెస్ట్ చేసిన చిత్తూరు పోలీసులు
అతనితో పాటు ఈ డ్రగ్స్‌ను స్థానిక యువకులకు పరిచయం చేసిన వ్యక్తిని, మరో 8 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి 180 గ్రాముల మెఫిడ్రోన్ స్వాధీనం చేసుకున్నారు.
ఒక్కసారి శరీరంలో చేరితే 6 నుంచి 10 గంటల పాటు నిషానిస్తుంది.. సైజులో ఉప్పు కణికలో సగభాగం ఉంటుంది.. దానిని వినియోగించేటప్పుడు బల్లపై గాని, సెల్ ఫోన్ పై గాని ఉంచి.. ఏటీఎం కార్డుతో 8 నుంచి 10 భాగాలుగా విభజిస్తారు.. ముక్కుతో పీల్చి శరీరంలోకి పంపిస్తారు.. ఇదేమిటనేది ఇప్పటికే మీ అర్థమైంది కదూ.. అదేనండీ.. మత్తు మందు... డ్రగ్స్.. దీని పేరు `మెఫిడ్రోన్ (ఎండీ)`.. కర్నాటక రాష్ట్రం బెంగళూరు నుంచి చిత్తూరుకు సరఫరా చేసి దీనిని స్థానిక యువకులకు విక్రయిస్తున్నారు.. డ్రగ్స్ ముఠా.
ఈ మత్తు మందు సరఫరా చేస్తున్న సూడాన్ దేశానికి చెందిన యువకుడిని చిత్తూరు పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు. అతనితో పాటు ఈ డ్రగ్స్‌ను స్థానిక యువకులకు పరిచయం చేసిన వ్యక్తిని, మరో 8 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి 180 గ్రాముల మెఫిడ్రోన్ స్వాధీనం చేసుకున్నారు.
చిత్తూరు నగరంలో మెఫిడ్రోన్‌తో పాటు ఎల్ ఎస్ డీ సింగిల్ డిప్, డబుల్ డిప్.. వాడుకలో ఉన్నట్టు తెలిసింది. ఎల్ ఎస్ డీ చిన్న స్టిక్కర్, మాత్రల రూపంలో దొరుకుతుంది. ఈ స్టిక్కర్‌ను నాలుకపై పెట్టుకున్న కొద్దిసేపటికే మత్తులోకి జారుకుంటారు. ఇప్పుడు వీటిని నిందితులు సులభంగా రవాణా చేస్తున్నట్టు గుర్తించిన పోలీసులు.. వారిపై కన్నేసి.. పట్టేశారు.
మెఫిడ్రోన్ డ్రగ్‌ను చిత్తూరు నగర యువకులు వినియోగిస్తున్న విషయం సమాచారం అందుకున్న డీఎస్పీ సుధాకరరెడ్డి తన టీమ్‌తో కలసి వారం రోజులుగా గట్టి నిఘా పెట్టారు. సూడాన్‌కు చెందిన నిందితుడు వీటిని బెంగళూరు నుంచి ఇక్కడికి సరఫరా చేస్తున్నాడని, తవణంపల్లెకు చెందిన సురాజ్ అనే వ్యక్తి వాటిని ఇక్కడ విక్రయిస్తున్నాడని వారి పరిశీలనలో తేలింది.
మెఫిడ్రోన్‌లో కూడా తక్కువ ధర కలిగినది, నాణ్యతతో కూడి ఎక్కువ ధర కలిగినది అందుబాటులో ఉంటాయి. తక్కువ ధర కలిగినది గ్రాము రూ.3 వేలకు విక్రయిస్తున్నారు. నాణ్యమైనదిగా భావించేది గ్రాము రూ.5 వేల నుంచి రూ.8 వేల వరకు విక్రయిస్తున్నట్టు సమాచారం. ఈ డ్రగ్స్ దందా వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారు.. ఏయే ప్రాంతాలకు వీటిని సరఫరా చేస్తున్నారనే వివరాలు దర్యాప్తులో తేలుతాయని పోలీసులు చెబుతున్నారు.