కూటమి గెలుపుపై చిరంజీవికి నమ్మకం లేదా..?
టీడీపీ, జనసేన విజయాన్ని ఆయన ఆకాంక్షించలేదు. ఆ మాటకొస్తే జనసేన అభ్యర్థులందర్నీ గెలిపించండి అని కూడా చిరంజీవి చెప్పలేదు.
పవన్ కల్యాణ్ విజయం కోరుతూ చిరంజీవి ఓ వీడియో చేశారు, సోషల్ మీడియాలో షేర్ చేశారు. "అమ్మ కడుపున ఆఖరివాడు, అందరి మేలు కోరేవాడు అంటూ".. బట్టీపట్టిన మాటల్ని బాగానే చెప్పారు మెగాస్టార్. ఇక్కడ కూటమి నేతలకు అర్థంకాని విషయం ఏంటంటే.. ఆయన కేవలం తన తమ్ముడిని మాత్రమే హైలైట్ చేశారు. కనీసం కూటమి పేరు కూడా చెప్పలేదు. టీడీపీ, జనసేన విజయాన్ని ఆయన ఆకాంక్షించలేదు. ఆ మాటకొస్తే జనసేన అభ్యర్థులంతా గెలవాలని కూడా చిరంజీవి చెప్పలేదు. దీంతో మెగాస్టార్ ఉద్దేశమేంటని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు.
కేవలం పవన్ గెలిస్తే చాలా..?
జనసేన అభ్యర్థులు గెలవాల్సిన పనిలేదా..?
పోనీ కూటమి అభ్యర్థులైనా గెలవాలని చిరంజీవి అనుకోవడంలేదా..?
కూటమి గెలుపుపై చిరుకి నమ్మకం లేదా..?
మెగాస్టార్ వీడియో సందేశం విన్న ఎవరికైనా వెంటనే వచ్చే ప్రశ్నలివి. ప్రజలకోసం, రాష్ట్రం కోసం తపనపడే వ్యక్తి పవన్ కల్యాణ్ అని, జనసేనాని ఏమి చేయాలో చూడాలంటే పిఠాపురం ప్రజలు ఆయనకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. పవన్ నిలబడతాడు, కలబడతాడు.. అంటూ కవితాత్మకంగా పిఠాపురం ప్రజలకు హితోపదేశం చేశారు చిరు. అయితే ఆయన ప్రచారం అంతా కేవలం పవన్ కల్యాణ్ కోసం మాత్రమే. గత ఎన్నికల్లో రెండు చోట్లా పోటీ చేసి ఓడిపోయిన పవన్ కల్యాణ్ కి, ఈసారయినా అసెంబ్లీ ఎంట్రీ ఇప్పించండి.. అంటూ తమ్ముడికోసం పిఠాపురం వాసుల్ని బతిమిలాడుకున్నారు అన్నయ్య.