Telugu Global
Andhra Pradesh

చిరంజీవి శుభాకాంక్షలు.. జగన్ పై పరోక్ష విమర్శలు

రాజధాని లేని రాష్ట్రం, గాయపడిన రాష్ట్రమంటూ చిరంజీవి వేసిన ట్వీట్ ఇప్పుడు సంచలనంగా మారింది.

చిరంజీవి శుభాకాంక్షలు.. జగన్ పై పరోక్ష విమర్శలు
X

ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై మెగాస్టార్ చిరంజీవి తనదైన శైలిలో స్పందించారు. కూటమి విజయం సందర్భంగా చంద్రబాబుకి శుభాకాంక్షలు చెబుతూనే పరోక్షంగా జగన్ పై ఆయన విమర్శలు ఎక్కుపెట్టారు. చిరు ట్వీట్ ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.

"ప్రియమైన చంద్రబాబు నాయుడు గారికి , చరిత్రలో అరుదైన విజయాన్ని అందుకున్న మీకు ముందుగా శుభాకాంక్షలు, అభినందనలు. ఈ మహత్తర విజయం, మీ మీద ప్రజలకున్న నమ్మకానికి, మీ నాయకత్వ పటిమకు, రాష్ట్రానికి గత వైభవం తిరిగి తేగలిగిన మీ దక్షతకు నిదర్శనం. రాజకీయ దురంధరులైన మీ మీద, పవన్ కల్యాణ్, నరేంద్ర మోడీ గారి మీద ప్రజలు కనపరచిన విశ్వాసాన్ని సంపూర్ణంగా నిలబెట్టుకొని, రాజధాని లేని, గాయపడిన రాష్ట్రాన్ని తిరిగి గాడిన పెట్టి నెంబర్ వన్ గా తీర్చిదిద్దుతారని ఆశిస్తున్నాను.!" అంటూ చిరు ట్వీట్ వేశారు.


రాజధాని లేని రాష్ట్రం, గాయపడిన రాష్ట్రం..

చిరంజీవి ట్వీట్ లో మిగతా విషయాలన్నీ బాగానే ఉన్నాయి కానీ.. రాజధాని లేని రాష్ట్రమంటూ ఏపీని ఆయన అభివర్ణించడం విశేషం. గతంలో మూడు రాజధానుల కాన్సెప్ట్ బాగా ఉందని స్పందించిన చిరంజీవి, ఇప్పుడు తన మనసులో మాట బయటపెట్టారని అంటున్నారు నెటిజన్లు. జగన్ ని విమర్శించేందుకే ఆయన ఈ పదాలు తన ట్వీట్ లో కలిపారని అంటున్నారు. గాయపడిన రాష్ట్రమంటూ ఏపీని పేర్కొనడంలో చిరంజీవి ఉద్దేశమేంటో ఆయనకే తెలియాలి. అది విభజన గాయమా, లేక గత ప్రభుత్వం గాయం చేసిందని చిరంజీవి కామెంట్ చేశారా అనేది చర్చనీయాంశమైంది.

అసెంబ్లీ ఎన్నికల సమయంలో కనీసం పవన్ కల్యాణ్ తరపున ప్రచారానికి వచ్చేందుకు కూడా చిరంజీవి వెనకడుగు వేశారు. నేరుగా ప్రజా క్షేత్రంలోకి వస్తే వైసీపీపై విమర్శలు చేయాల్సి వస్తుంది, ఇతర నేతలపై కామెంట్లు చేయాల్సి వస్తుందన్న ఉద్దేశంతోనే ఆయన ప్రచారానికి రాలేదు. సింపుల్ గా తన తమ్ముడికి ఓటు వేయాలంటూ సోషల్ మీడియాలో ఓ మెసేజ్ ఉంచారు. ఇప్పుడు కూటమి అధికారంలోకి రాగానే ఆయన స్వరం పెంచారు. చంద్రబాబుని పొగుడుతూ, గత ప్రభుత్వానికి చురకలంటిస్తూ మెసేజ్ పెట్టారు.

First Published:  4 Jun 2024 11:17 AM GMT
Next Story