ఏపీ రాజకీయాలపై తేల్చేసిన చిరంజీవి - అక్కడి రాజకీయాలతో తనకు ఎలాంటి సంబంధమూ లేదని స్పష్టీకరణ
తనకు ఓటు హక్కు కూడా హైదరాబాద్‌లోనే ఉందని, పొరుగు రాష్ట్రాల్లో రాజకీయాలకు సంబంధించి తనకు ఎలాంటి ఆసక్తి లేదని చిరంజీవి స్పష్టం చేశారు.

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి తాను వెళ్లబోనని మెగా స్టార్ చిరంజీవి కుండబద్దలు కొట్టినట్టు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు ఆయనపై వస్తున్న ఊహాగానాలకు ఈ ప్రకటనతో తెరపడినట్టేనని చెప్పాలి. జనసేన అధ్యక్షుడిగా చిరంజీవి తమ్ముడు పవన్ కల్యాణ్ ఏపీలో కొనసాగుతుండటం, అధికార పార్టీపై ఎప్పటికప్పుడు విమర్శలు చేస్తుండటం, ఆయనపై అధికార పార్టీ నేతలు కూడా విరుచుకుపడుతుండటం కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలో చిరంజీవి ఇటీవల చేసిన వ్యాఖ్యలు కూడా చర్చనీయాంశమయ్యాయి. తన తమ్ముడు సీఎం అయితే చూడాలని తనకు ఉండదా అంటూ ఆయన వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో చిరంజీవి తన తమ్ముడు పవన్ కల్యాణ్‌కు ఎన్నికల నాటికి సపోర్టుగా నిలుస్తాడని అందరూ భావించారు.
2024 ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో చిరంజీవి సోదరులు పవన్ కల్యాణ్, నాగబాబు ఏపీలో ఇప్పటికే పొలిటికల్ యాక్టివిటీస్ స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. తెలుగుదేశం పార్టీతో జనసేన పొత్తు పెట్టుకుంటున్న నేపథ్యంలో చిరంజీవి ఆశీస్సులు పవన్ కల్యాణ్‌కు ఉంటాయా అనే ప్రశ్నలు వచ్చాయి. గతంలో ప్రజారాజ్యం పార్టీతో రాజకీయ నాయకుడిగా యాక్టివ్‌గా వ్యవహరించిన చిరంజీవి.. ఆ తర్వాత పూర్తిగా సినిమాలకే తన సమయం కేటాయిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల పరిణామాల నేపథ్యంలో ఆయన మళ్లీ ఏపీ రాజకీయాల్లో యాక్టివ్ అవుతారా అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలోనే చిరంజీవి తాజాగా ఓ మీడియాతో మాట్లాడుతూ ఓ విస్పష్ట ప్రకటన చేశారు.
తనకు ఏపీ రాజకీయాలకు సంబంధించి ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు. తనకు ఓటు హక్కు కూడా హైదరాబాద్‌లోనే ఉందని, పొరుగు రాష్ట్రాల్లో రాజకీయాలకు సంబంధించి తనకు ఎలాంటి ఆసక్తి లేదని స్పష్టం చేశారు. పొరుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుందనే విషయమై తాను కనీసం పత్రికలు కూడా చూడటం లేదని ఆయన తేల్చి చెప్పారు. తన సోదరుడు పవన్ కల్యాణ్ ఏపీ రాజకీయాల్లో ఉన్నందు వల్ల తనకు రాజకీయాలు అంటగట్టడం సరికాదని కూడా ఆయన స్పష్టం చేశారు.
మెగా బ్రదర్స్ ముగ్గురికీ రాజకీయ భవిష్యత్తు లేదంటూ ఏపీ మంత్రి రోజా ఇటీవల విమర్శించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రోజా వ్యాఖ్యలపైనా చిరంజీవి స్పందిస్తూ ఆమె ఆ వ్యాఖ్యలు ఏ కారణంతో చేశారనే విషయం ఆమెనే అడగాలని చెప్పారు. రోజాతో తాను కలిసి నటించానని, ఆమెతో తమకు ఎలాంటి మనస్పర్థలూ లేవని ఈ సందర్భంగా చిరంజీవి స్పష్టం చేశారు. మంత్రి అయ్యాక రోజా తమ ఇంటికి కూడా వచ్చారని ఈ సందర్భంగా గుర్తు చేశారు.