చిరంజీవి మళ్ళీ ఎంట్రీ ఇస్తారా?
జరుగుతున్నది చూస్తుంటే ఒక వ్యూహం ప్రకారమే మళ్ళీ చిరంజీవి రాజకీయ ప్రవేశానికి వేదిక సిద్ధమవుతుందా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. జగన్మోహన్ రెడ్డితో చిరంజీవికి ఎంత మంచి స్నేహమున్నా అదంతా తమ్ముడి తర్వాతే.
వ్యూహాత్మకమో లేకపోతే యాధృచ్చికమో తెలీదుకానీ మెగాస్టార్ చిరంజీవిపై ఒత్తిడి పెరిగిపోతోంది. చిరంజీవి మళ్ళీ రాజకీయాల్లోకి రావాలని, జనసేనలో చేరి బాద్యతలు తీసుకోవాలనే డిమాండ్లు పెరిగిపోతున్నాయి. వైసీపీ పాలనపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేస్తున్న పోరాటాలు సక్సెస్ కావాలంటే మెగాస్టార్ కచ్చితంగా తనవంతు బాధ్యతలు నిర్వహించాల్సిందేనంటూ అభిమానులు పదేపదే విజ్ఞప్తులు చేస్తున్నారు. ఒకప్పుడు ప్రజారాజ్యం పార్టీలో పనిచేసిన చిరంజీవి అభిమానులంతా తిరుపతిలో సమావేశమయ్యారు.
ప్రజారాజ్యం పార్టీలో పనిచేసి తర్వాత టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల్లో చేరిపోయిన నేతలంతా ఓ ఫంక్షన్ హాలులో భేటీ అయ్యారు. మెగాస్టార్ అభిమాని ప్రస్తుత టీడీపీ నేత అయిన ఊకా విజయ్ కుమార్, జనసేన నేత కిరణ్ రాయల్ మాట్లాడుతూ మళ్ళీ చిరంజీవి రాజకీయాల్లోకి రావాలని విజ్ఞప్తి చేశారు. జనసేన బలోపేతం కావాలన్నా, అధికారంలోకి రావాలన్న పవన్ ప్రయత్నాలు సక్సెస్ కావాలన్నా చిరంజీవి సాయం చాలా అవసరమన్నారు.
ఆమధ్య కాకినాడలో.. తర్వాత వైజాగ్‌లో కూడా చిరంజీవి అభిమాన సంఘాలు ఇదే విధంగా డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. ఇదంతా చూస్తుంటే తాను రాజకీయాలకు దూరంకాలేదన్న సినిమా డైలాగ్‌ను నిజం చేయాలని అనుకుంటున్నట్లున్నారు. పైగా ఆమధ్య చిరంజీవి ఓ ఫంక్షన్‌లో మాట్లాడుతూ.. ప్రజలంతా ఆశీర్వదిస్తే తన తమ్ముడు ముఖ్యమంత్రి అవటం పెద్ద కష్టంకాదన్నారు. అవసరమైతే పవన్‌కు తన మద్దతుంటుందన్న అర్ధంవచ్చేట్లుగా మాట్లాడారు. అప్పటి నుండే చిరంజీవి మళ్ళీ రాజకీయాల్లోకి వస్తారనే అనుమానాలు, రావాలనే డిమాండ్లు పెరిగిపోతున్నాయి.
జరుగుతున్నది చూస్తుంటే ఒక వ్యూహం ప్రకారమే మళ్ళీ చిరంజీవి రాజకీయ ప్రవేశానికి వేదిక సిద్ధమవుతుందా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. జగన్మోహన్ రెడ్డితో చిరంజీవికి ఎంత మంచి స్నేహమున్నా అదంతా తమ్ముడి తర్వాతే.
తాను క్రియాశీలక పాత్ర పోషిస్తే పవన్ కచ్చితంగా అధికారంలోకి రావటం ఖాయమని చిరంజీవి అనుకుంటే వెంటనే రంగంలోకి దిగటానికి వెనకాడరు. ఇప్పటికే చిరంజీవి అభిమాన సంఘాలన్నీ జనసేన గెలుపు కోసమే పనిచేస్తున్నాయి. కాబట్టి అభిమాన సంఘాల డిమాండ్లని, జనాలు కోరుకుంటున్నారని, పూర్వ పీఆర్పీ నేతల విజ్ఞప్తని.. ఏవేవో కబుర్లు చెప్పి చివరకు ఎన్నికలకు ముందు చిరంజీవి హఠాత్తుగా జనసేన తరపున యాక్టివ్ అయ్యే అవకాశాలున్నాయనే అనిపిస్తోంది. చూద్దాం చివరకు ఏమి జరుగుతుందో.