చిరంజీవికి 'మెహర్' పంచ్.. వైసీపీ 'ఖుషీ'
పనిగట్టుకుని చిరంజీవిని కానీ, ఆ సినిమాని కానీ వైసీపీ నాయకులు విమర్శించాల్సిన అవసరం లేదని అర్థమైంది. అందుకే వైసీపీ నేతలంతా దర్శకుడు మెహర్ రమేష్ కి థ్యాంక్స్ చెబుతున్నారు. పిచ్చుకపై ఎవరూ బ్రహ్మాస్త్రం వేయాల్సిన పనిలేదంటున్నారు.
భోళా శంకర్ సినిమాలో చిరంజీవి ఖుషీ మూవీలోని ఓ సీన్ రిపీట్ చేశారు. అభిమానులు ఆ సీన్ తో ఖుషీ అయ్యారో లేదో కానీ, సినిమా రిజల్ట్ తో మాత్రం వైసీపీ ఫుల్ ఖుషీగా ఉంది. గతంలో బ్రో సినిమా విషయంలో వైసీపీ పనిగట్టుకుని నెగెటివ్ పబ్లిసిటీ చేయాలని చూసింది. కలెక్షన్లు తగ్గిపోయాయి, కనీసం హీరో రెమ్యునరేషన్ కూడా వసూలు కాలేదు. నిర్మాత నష్టాల్లో మునిగిపోయాడంటూ సాక్షాత్తూ మంత్రి అంబటి మీడియా ముందుకొచ్చి లెక్కలు చదివారు. కానీ భోళా విషయంలో ఆ కష్టం వైసీపీకి లేకుండా పోయింది. పనిగట్టుకుని సినిమా పరిస్థితి ఇదీ అని ఎవరికీ చెప్పాల్సిన పనిలేదు. అభిమానులు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని ఆ స్థాయిలో నిలబెట్టుకున్నారు దర్శకుడు మెహర్ రమేష్. బహుశా, చిరంజీవి మినహా దర్శకుడు మెహర్ పై అందరికీ అవే అంచనాలున్నాయి. వాటిని ఏమాత్రం అతను దాటిపోలేదు.
పిచ్చుకపై బ్రహ్మాస్త్రం..
ఇటీవల వాల్తేరు వీరయ్య సినిమా ఫంక్షన్లో పిచ్చుకపై బ్రహ్మాస్త్రం ఎందుకంటూ చిరంజీవి, వైసీపీపై పంచ్ లు వేశారు. ప్రజల బాగు గురించి, రాష్ట్రం అభివృద్ధి గురించి నాయకులు ఆలోచించాలంటూ చురకలంటించారు. వైసీపీ నుంచి కూడా ఘాటు రియాక్షన్లు వచ్చాయి. ఇప్పుడు భోళా శంకర్ రిలీజ్ తర్వాత మెగా క్యాంప్ నుంచి సౌండ్ తగ్గింది, సోషల్ మీడియాలో వైసీపీ సౌండ్ పెరిగింది.
భోళా శంకర్ అంచనాలను అందుకున్నా, వాటిని మించిపోయినా పరిస్థితి మరోలా ఉండేది. కానీ ఫస్ట్ డే, ఫస్ట్ షో తో వ్యవహారం తేలిపోయింది. పనిగట్టుకుని చిరంజీవిని కానీ, ఆ సినిమాని కానీ వైసీపీ నాయకులు విమర్శించాల్సిన అవసరం లేదని అర్థమైంది. అందుకే వైసీపీ నేతలంతా దర్శకుడు మెహర్ రమేష్ కి థ్యాంక్స్ చెబుతున్నారు. పిచ్చుకపై ఎవరూ బ్రహ్మాస్త్రం వేయాల్సిన పనిలేదంటున్నారు.