జనవరి నుంచి జగన్ పర్యటనలా..?
డిసెంబర్ చివరికల్లా 175 మంది అభ్యర్థులను ఫైనల్ చేసేయాలని డిసైడ్ అయ్యారట. అందుకనే సర్వే బృందాల్లో కూడా స్పీడు పెంచారు. ఇవన్నీ ఒకవైపు జరుగుతుండగానే మరోవైపు సామాజిక సాధికార బస్సుయాత్రల జోరు పెంచారు.
జనవరి నుంచి జగన్మోహన్ రెడ్డి జనాల్లోకి వెళ్ళిపోవాలని డిసైడ్ అయినట్లు సమాచారం. మొన్నటి ఎన్నికల్లో పార్టీ తరఫున 151 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. అందుకని ప్రత్యర్థులు గెలిచిన 24 నియోజకవర్గాల్లో ఇన్‌చార్జ్‌లను నియమించారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని 11 నియోజకవర్గాల్లో ఇన్‌చార్జ్‌లను మార్చారు. మరో 35 నియోజకవర్గాల్లో కూడా మార్పుంటుందని ప్రచారం జరుగుతోంది. ఇలాంటి మార్పులన్నింటినీ డిసెంబర్ నెలాఖరులోగా పూర్తిచేసేయాలని జగన్ డిసైడ్ అయ్యారట. అంటే 175 నియోజకవర్గాల్లోనూ పోటీచేసే అభ్యర్థ/లు ఫైనల్ అయిపోతారనే అనుకోవాలి.
అందుకనే జనవరి నుంచి జగన్ జనాల్లోకి వెళ్ళిపోవాలని అనుకున్నారట. జనాల్లోకి వెళ్ళటం అంటే అభ్యర్థులతో కలిసి ప్రతి నియోజకవర్గంలోనూ పర్యటించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఇప్పుడు జిల్లాల నేతలతో తరచూ సమావేశమవుతున్నారు. ఇదే సమయంలో అబివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పేరుతో వారానికి ఒకటి రెండు జిల్లాలో పర్యటిస్తున్నారు. ఫిబ్రవరి 2వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని, మార్చి 6వ తేదీన పోలింగ్ జరుగుతుందనే ప్రచారం అందరికీ తెలిసిందే.
జరుగుతున్న ప్రచారం నిజమైతే అభ్యర్థుల ఎంపిక, ప్రచారానికి పెద్దగా వ్యవధి ఉండదు. అందుకనే ఇప్పటినుండే జిల్లాలు, నియోజకవర్గాల వారీగా జగన్ రివ్యూలు చేస్తున్నారు. డిసెంబర్ చివరికల్లా 175 మంది అభ్యర్థులను ఫైనల్ చేసేయాలని డిసైడ్ అయ్యారట. అందుకనే సర్వే బృందాల్లో కూడా స్పీడు పెంచారు. ఇవన్నీ ఒకవైపు జరుగుతుండగానే మరోవైపు సామాజిక సాధికార బస్సుయాత్రల జోరు పెంచారు. ఈ బస్సుయాత్రలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కాపువర్గాల ప్రజాప్రతినిధులు, నేతలను అన్నీ నియోజకవర్గాల్లోను తిప్పుతున్నారు. వీళ్ళ ఆధ్వర్యంలో నియోజకవర్గాల్లో ఎక్కడికక్కడ సభలు జరుగుతున్నాయి.
ప్రతిపక్షాలు టీడీపీ, జనసేన మధ్య ఇంకా పొత్తు చర్చలే ఫైనల్ కాలేదు. కాబట్టి పోటీచేసే నియోజకవర్గాల సంఖ్య, నియోజకవర్గాలు ఖరారులో సమస్యలు బయటపడే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. జనసేన మిత్రపక్షం బీజేపీ పరిస్థితి ఏమిటో ఎవరికీ అర్థంకావటంలేదు. ఇక కాంగ్రెస్, వామపక్షాల గురించి ఆలోచించే అవసరమేలేదు. ప్రతిపక్షాల పరిస్థితి ఇలాగుంటే.. జగన్ మాత్రం జనాల్లో అభ్యర్థులతో ప్రచారానికి రెడీ అయిపోతున్నారు. బహుశా సంక్రాంతి పండుగ తర్వాత జగన్ పర్యటనలు ఉండచ్చని సమాచారం.