Telugu Global
Andhra Pradesh

తిరుమలలో ఊహించని రద్దీ.. 2 చిరుతలు కూడా

భక్తులెవ్వర్నీ ఒంటరిగా మెట్లు ఎక్కేందుకు అనుమతించట్లేదు. గుంపులు గుంపులుగా మాత్రమే కొండ ఎక్కాలని సూచిస్తున్నారు అధికారులు.

తిరుమలలో ఊహించని రద్దీ.. 2 చిరుతలు కూడా
X

వేసవి సెలవలతోపాటు ఎన్నికల హడావిడి కూడా పూర్తి కావడంతో తిరుమలకు వెళ్లే భక్తుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. కిలోమీటర్ల మేర క్యూలైన్లు కనపడుతున్నాయి. మరో వారం రోజులపాటు ఇదే స్థాయిలో రద్దీ ఉంటుందని సమాచారం. ఫలితాల తర్వాత కూడా శ్రీవారి మొక్కు చెల్లించుకునేవారు ఉండనే ఉంటారు. ఈ క్రమంలో ఇప్పుడు నడకదారిలో రెండు చిరుత పులులు కనపడటం విశేషం.

గతంలో కూడా తిరుమలలో చిరుత పులుల సంచారం కలకలం రేపింది. ఓ బాలిక ప్రాణం తీసిన చిరుతను బోనులో బంధించారు అధికారులు. ఆ తర్వాత మరిన్ని చిరుతలను పట్టి జూ పార్క్ కి తరలించారు. ఆ తర్వాత వాటిలో కొన్నిటిని దట్టమైన అడవిలోకి తీసుకెళ్లి వదిలిపెట్టామని కూడా తెలిపారు. ఆమధ్య భక్తుల చేతికే కర్రలు ఇచ్చి సెల్ఫ్ ప్రొటెక్షన్ ప్లాన్ కూడా టీటీడీ అమలు చేసింది. ఇటీవల ఆ భయం తగ్గిపోయింది, ఇప్పుడు మళ్లీ చిరుతలు కనపడటంతో భయం మొదలైంది.

అలిపిరి నడకదారిలో ఆఖరి మెట్ల వద్ద రెండు చిరుతలు సంచరిస్తున్నాయని చెబుతున్నారు భక్తులు. వాటిని చూసిన భక్తులు భయంతో కేకలు పెట్టారు, అక్కడినుంచి పరుగులు తీశారు. వారి కేకలతో చిరుతలు అడవిలోకి పారిపోయాయని అంటున్నారు. ప్రత్యక్ష సాక్షులు ఉన్నా కూడా వాటి జాడను సీసీ టీవీ ఫుటేజీలో నిర్థారించుకుంటేనే అధికారిక ప్రకటన వెలువడే అకాశముంది. ప్రస్తుతం టీటీడీ విజిలెన్స్ సిబ్బంది మెట్ల మార్గం వద్దకు చేరుకుని పరిస్థితి పర్యవేక్షిస్తున్నారు. చిరుతల జాడను గుర్తించేందుకు అటవీశాఖ సిబ్బంది కూడా రంగంలోకి దిగారు. భక్తులెవ్వర్నీ ఒంటరిగా మెట్లు ఎక్కేందుకు అనుమతించట్లేదు. గుంపులు గుంపులుగా మాత్రమే కొండ ఎక్కాలని సూచిస్తున్నారు అధికారులు.

First Published:  20 May 2024 5:32 PM IST
Next Story