చంద్రబాబుకు కుప్పం టెన్షన్.. పరిస్థితి ఏంటి..!
నిజానికి వైసీపీ ఏర్పడిన నాటి నుంచి కుప్పంలో చంద్రబాబు మెజార్టీ తగ్గుతూ వస్తోంది. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు 47 వేల మెజార్టీ సాధించిన చంద్రబాబు.. 2019 నాటికి 30 వేల మెజార్టీకి పడిపోయారు.
కుప్పం.. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గం. 1989 నుంచి టీడీపీకి కుప్పం కంచుకోట. ఐతే ఏపీలో హాట్ టాపిక్‌గా మారిన నియోజకవర్గాల జాబితాలో ఇప్పుడు కుప్పం కూడా చేరిపోయింది. ఎందుకంటే.. ఈ సారి వై నాట్ 175 నినాదం ఎత్తుకున్న వైసీపీ.. కుప్పంపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఈ సారి చంద్రబాబును ఎలాగైనా ఓడించాలన్న పట్టుదలతో ఉన్న వైసీపీ.. అందుకు తగ్గట్టుగా వ్యూహాలు రచించింది. కుప్పం మున్సిపాలిటీకి జరిగిన ఎన్నికల్లో వైసీపీ జెండా ఎగురవేసింది. మంత్రి పెద్దిరెడ్డి స్వయంగా కుప్పం బాధ్యతలు తీసుకున్నారు.
వైసీపీ వ్యూహాలతో చంద్రబాబు ఆత్మరక్షణలో పడిపోయారు. ఈ ఎన్నికల్లో కుప్పంతో పాటు కోస్తాంధ్రలో తెలుగుదేశం పార్టీకి సేఫ్ జోన్‌గా మరో సీటులోనూ చంద్రబాబు పోటీ చేస్తారని వార్తలు కూడా వచ్చాయి. చంద్రబాబు కుప్పంలో గెలవలేరనే ప్రచారం కూడా జోరుగా సాగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా చంద్రబాబు తన సతీమణి నారా భువనేశ్వరిని రంగంలోకి దించడం ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూర్చింది. కుప్పంలో ఊరూరు తిరిగి చంద్రబాబు కోసం ఓట్లడిగారు భువనేశ్వరి. ప్రచారంలో భువనేశ్వరి స్వయంగా ఓటర్ల చేతికి డబ్బులివ్వడం కూడా కనిపించింది.
ఈ సారి యువకుడు, డాక్టర్ KRJ భరత్‌ను పోటీకి దింపింది వైసీపీ. గత మూడేళ్లుగా భరత్ కుప్పంలో తీవ్రంగా కష్టపడ్డారు. ఇక వైసీపీ సైతం కుప్పం అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు చేసింది. భరత్‌ను గెలిపిస్తే మంత్రిని చేస్తానని.. కుప్పం అభివృద్ధి బాధ్యత తాను తీసుకుంటానని జగన్ స్వయంగా ప్రకటించారు. నిజానికి వైసీపీ ఏర్పడిన నాటి నుంచి కుప్పంలో చంద్రబాబు మెజార్టీ తగ్గుతూ వస్తోంది. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు 47 వేల మెజార్టీ సాధించిన చంద్రబాబు.. 2019 నాటికి 30 వేల మెజార్టీకి పడిపోయారు.
ఇప్పటివరకూ ఉన్న సమాచారం ప్రకారం తాజా ఎన్నికల్లో కుప్పంలో 85 శాతానికి పైగా పోలింగ్ నమోదైనట్లు తెలుస్తోంది. పోలింగ్ సరళిని పరిశీలించిన వారి అభిప్రాయం ప్రకారం కుప్పంలో చంద్రబాబుకు ఎదురీత తప్పదని చెప్తున్నారు. షాకింగ్ ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు. చంద్రబాబు ఓడినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు. ఒకవేళ గెలిస్తే మెజార్టీ మాత్రం 10 వేల లోపే ఉంటుందని చెప్తున్నారు.