విదేశాలకు పారిపోయిన చంద్రబాబు మాజీ పీఎస్
సెప్టెంబర్ 5న పల్లోంజి సంస్థ ప్రతినిధి మనోజ్ వాసుదేవ్ దుబాయ్ పారిపోయినట్టు ఏపీ సీఐడీ గుర్తించింది. పెండ్యాల శ్రీనివాస్ సెప్టెంబర్ 6న అమెరికాకు వెళ్లిపోయారు.
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ముడుపుల వ్యవహారంలో కీలక పాత్రధారులు విదేశాలకు పారిపోయారు. చంద్రబాబు మాజీ పీఎస్ పెండ్యాల శ్రీనివాస్‌తో పాటు పల్లోంజి సంస్థ ప్రతినిధి మనోజ్ వాసుదేవ్ పార్థసాని విదేశాలకు వెళ్లిపోయారు. వీరిద్దరి పేర్లు అటు స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో కూడా ఉండటంతో విచారణకు రావాల్సిందిగా ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ నోటీసులు జారీ చేసింది.
ఈ నేపథ్యంలోనే సెప్టెంబర్ 5న పల్లోంజి సంస్థ ప్రతినిధి మనోజ్ వాసుదేవ్ దుబాయ్ పారిపోయినట్టు ఏపీ సీఐడీ గుర్తించింది. పెండ్యాల శ్రీనివాస్ సెప్టెంబర్ 6న అమెరికాకు వెళ్లిపోయారు. ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్న శ్రీనివాస్ తొలుత తనకు ఈనెల 11 నుంచి సెలవు కావాలంటూ దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఐటీ నోటీసుల వ్యవహారం బయటకు రావడంతో ఈనెల 5న హఠాత్తుగా ఒక లీవ్ లెటర్ ఇచ్చేసి వెళ్లిపోయినట్టు చెబుతున్నారు. ఆ తర్వాత అతడిని సంప్రదించేందుకు అధికారులు ప్రయత్నించినా అందుబాటులోకి రాలేదు. చివరకు ఆయన సెప్టెంబర్ 6న హైదరాబాద్ నుంచి అమెరికా వెళ్లిపోయినట్టు సీఐడీ గుర్తించింది.
నోటీసు అందుకున్న మూడో వ్యక్తి యోగేష్ గుప్తా మాత్రం సోమవారం సిట్ విచారణకు హాజరయ్యేందుకు అంగీకరించారు. మరి ఇప్పుడు మాజీ పీఎస్ శ్రీనివాస్, పల్లోంజి ప్రతినిధి మనోజ్ తిరిగి వచ్చి విచారణకు హాజరవుతారా..? లేకా విదేశాల్లోనే మరి కొంతకాలం ఉంటారా..? అన్నది చూడాలి.
*