Telugu Global
Andhra Pradesh

రైతులకు స్వర్ణయుగమట..ఇంతన్యాయమా..?

ఎన్నికలకు ముందు చెప్పిన రు. 85 వేల కోట్లెక్కడ, ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రకటించిన రు. 25 వేల కోట్లెక్కడ ? మరి మధ్యలో రు. 60 వేల కోట్ల బకాయిల మాటేమిటి ?

రైతులకు స్వర్ణయుగమట..ఇంతన్యాయమా..?
X

తెలుగుదేశం పార్టీ హయాంలో రైతులకు 2014-19 స్వర్ణయుగమని చంద్రబాబు నాయుడు చెప్పారు. విజయనగరం పర్యటనలో చంద్రబాబు మాట్లాడుతూ వ్యవసాయ రంగం గురించి ఆలోచించిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది టీడీపీ ప్రభుత్వం మాత్రమే అని అన్నారు. చంద్రబాబు మాటలు విన్నతర్వాత ఇంతకన్నా అన్యాయం మరోటుంటుందా అనిపించింది. 2014-19 మధ్య రైతులను అన్నీరకాలుగా ముంచేసిందే చంద్రబాబు అని అందరికీ తెలుసు.

2014 ఎన్నికల్లో అధికారంలోకి రావాలన్న ఉద్దేశ్యంతో రైతు రుణమాఫీ ప్రకటించారు. రుణమాఫీ ప్రకటించినప్పుడు చెప్పిన మొత్తం సుమారు రు. 85 వేల కోట్లు. బ్యాంకుల్లో తాకట్టుపెట్టిన మహిళల బంగారాన్నంతా తానే విడిపిస్తానని హామీఇచ్చారు. బ్యాంకు రుణాలను ఎవరు కట్టవద్దన్నారు. చంద్రబాబు మాటలు నమ్మిన రైతులు అప్పటివరకు కడుతున్న రుణవాయిదాలను కట్టడం మానేశారు. తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు రైతు రుణాల రద్దును ప్రకటించింది రు. 25 వేల కోట్లు మాత్రమే.

ఎన్నికలకు ముందు చెప్పిన రు. 85 వేల కోట్లెక్కడ, ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రకటించిన రు. 25 వేల కోట్లెక్కడ ? మరి మధ్యలో రు. 60 వేల కోట్ల బకాయిల మాటేమిటి ? ఇక బ్యాంకుల్లో కుదవపెట్టిన బంగారం మాటనే చంద్రబాబు పట్టించుకోలేదు. పెరిగిపోయిన రుణాలు కట్టలేక, బంగారాన్ని విడిపించుకోలేక రైతులు నానా అవస్థ‌లుపడ్డారు. అప్పులు+వడ్డీలు పెరిగిపోవటంతో వాయిదాలు చెల్లించలేకపోవటంతో చాలా చోట్ల రైతులు కుదవపెట్టిన బంగారాన్ని బ్యాంకులు వేలంవేసేశాయి.

ఇక రుణమాఫీగా ప్రకటించిన రు. 25 వేల కోట్లనయినా చెల్లించారా అంటే అదీలేదు. మూడువాయిదాలు చెల్లించి ఎన్నికల నాటికి రు. 13 వేల కోట్లను బకాయిలు పెట్టి దిగిపోయారు. అంటే ఎన్నికలకు ముందు రుణమాఫీ అని రూ. 85 వేల కోట్లు ప్రకటించి చివరకు రు. 12 వేల కోట్లను మాత్రం చెల్లించారు. దీన్నిబట్టే రైతులను చంద్రబాబు ఎంతగా మోసంచేశారో అర్ధమవుతోంది. ఇన్ పుట్ సబ్సిడీ చెల్లించకపోవటం, వ్యవసాయ రుణాలు మంజూరు చేయకపోవటం, పంటల బీమాలు లేకపోవటం, మద్దతుధరలు అందించకపోవటం అదనం. రైతులకు చేయాల్సిన నష్టమంతా చేసేసి ఇపుడు రైతులకు తన పాలనే స్వర్ణయుగమని చెప్పుకోవటం చంద్రబాబుకే చెల్లింది.

First Published:  25 Dec 2022 5:11 AM GMT
Next Story