బొత్స మెడలో గంట కట్టాలనే బాబు కోరిక తీరేనా..?
ప్రతి ఎన్నికల్లోనూ స్థానం మారుతూ వస్తున్నానని.. ఈసారి భీమిలి ఇప్పించాలని గంటా కోరుతున్నారు. విశాఖ దాటి వెళ్లే ఉద్దేశం తనకు లేదని పదేపదే ప్రకటిస్తున్నారు.
మంత్రి బొత్స సత్యనారాయణను ఎలాగైనా ఓడించాలని విశ్వప్రయత్నాలు చేస్తున్న చంద్రబాబు.. చీపురుపల్లిలో ఆయనపై మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావును పోటీకి నిలబెట్టాలని గట్టిగా పట్టబడుతున్నారు. అయితే ఎన్నిసార్లు అడిగినా గంటా మాత్రం ససేమిరా అంటున్నారు. ఇప్పటికే రెండుసార్లు గంటాను అడిగి భంగపడిన చంద్రబాబు నిన్న ఆయన మరోసారి కలిసినప్పుడు కూడా ఇదే మాట చెప్పారు.
నువ్వు వెళ్లు.. నేను చూసుకుంటానంటే నమ్మేదెలా..?
నువ్వు వెళ్లి చీపురుపల్లిలో పోటీ చెయ్యి అంటూ చంద్రబాబు బుధవారం కూడా తనను కలిసిన గంటా శ్రీనివాసరావును ఆదేశించారు. నువ్వు వెళ్లు.. నేను చూసుకుంటానంటూ బాబు చెబుతున్నా గంటా అవుననలేదు.. కాదనలేదు. బొత్సలాంటి రాజకీయ దిగ్గజాన్ని ఆయన సొంతూళ్లో ఢీకొట్టి గెలవడం జరగని పని అనే భావనతోనే గంటా ఏమీ మాట్లాడటం లేదు.
భీమిలి కావాలంటున్న గంటా
ప్రతి ఎన్నికల్లోనూ స్థానం మారుతూ వస్తున్నానని.. ఈసారి భీమిలి ఇప్పించాలని గంటా కోరుతున్నారు. విశాఖ దాటి వెళ్లే ఉద్దేశం తనకు లేదని పదేపదే ప్రకటిస్తున్నారు. కానీ, బాబు ముందుకు వెళ్లేసరికి ఆయన నువ్వు చీపురుపల్లి అనడం.. అవుననలేక, కాదనలేక నోరు మెదపకుండా వచ్చేయడం గంటా వంతు అన్నట్లు పరిస్థితి తయారైంది. కాసేపట్లో రెండో విడత టికెట్లన్నీ ప్రకటించడానికి చంద్రబాబు జాబితా సిద్ధం చేసుకున్న నేపథ్యంలో గంటా పరిస్థితేంటో అర్థం కావట్లేదు.