ఆ రెండు పథకాల పేర్లు మార్పు..చంద్రబాబు నిర్ణయం!
ఇవాల్టి నుంచి ఏపీ వ్యాప్తంగా స్కూల్స్ ప్రారంభమయ్యాయి. జగనన్న గోరుముద్దలో భాగంగా ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థులకు చిక్కీలు కూడా అందించేవారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. జగన్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన రెండు ముఖ్యమైన పథకాలకు పేర్లు మార్చారు. జగనన్న విద్యా కానుక పేరును స్టూడెంట్ కిట్‌గా మార్చేశారు. ఈ మేరకు ఇప్పటికే గైడ్‌లైన్స్ కూడా విడుదలయ్యాయి. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు రెండు జతల స్కూల్ యూనిఫాం, పాఠ్య పుస్తకాలు, నోట్‌బుక్స్, డిక్షనరి, స్కూల్ బ్యాగ్‌తో కూడిన కిట్‌ను అందించే పథకాన్ని 2021లో ప్రారంభించారు జగన్. తద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన ఫలితాలు సాధించేందుకు కృషి చేశారు. ఈ ఏడాది దాదాపు 36.69 లక్షల మంది విద్యార్థులకు ఈ కిట్లు అందివ్వనున్నారు. ఐతే వీటి సరఫరాకు గత జగన్ ప్రభుత్వమే ఆర్డర్ ఇచ్చింది.
ఇక పేద విద్యార్థుల కోసం జగన్ ప్రవేశపెట్టిన మరో పథకం జగనన్న గోరుముద్ద. ఈ పథకం పేరు కూడా మార్చేసింది చంద్రబాబు సర్కార్. PM పోషణ్ - గోరుముద్ద పేరుతో ఈ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. 2020 జనవరిలో ఈ స్కీంను ప్రారంభించారు జగన్. రోజుకో మెనూతో పిల్లలకు పౌష్టికాహారాన్ని అందించడమే లక్ష్యంగా ఈ స్కీంను విజయవంతంగా అమలు చేశారు.
ఇవాల్టి నుంచి ఏపీ వ్యాప్తంగా స్కూల్స్ ప్రారంభమయ్యాయి. జగనన్న గోరుముద్దలో భాగంగా ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థులకు చిక్కీలు కూడా అందించేవారు. గతంలో చిక్కీలపై జగన్ ఫోటోతో కవర్లు ప్రింట్ చేయగా..కొత్తగా వచ్చిన ప్రభుత్వం వాటిని తొలగించి ఏపీ ప్రభుత్వ రాజముద్రతో రూపొందించింది. ఇక త్వరలోనే విద్యాదీవెన, వైఎస్సార్ చేయూత లాంటి పథకాల పేర్లు కూడా మారనున్నాయి.