చంద్రబాబు రోజువారీ లీగల్ ఇంటర్వ్యూల్లో కోత.. రీజన్ ఇదే!
రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ రాహుల్ రీఎంట్రీ ఇచ్చిన మొదటి రోజే చంద్రబాబు లీగల్ ఇంటర్వ్యూలో కోత పడటంపై టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి.
రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబుకు లీగల్ ఇంటర్వ్యూల్లో కోత పడింది. గత నెల రోజులుగా ఆదివారం మినహా మిగిలిన ఆరు రోజులూ రోజుకు రెండు లీగల్ ఇంటర్వ్యూల్లో మాట్లాడేందుకు చంద్రబాబుకి జైలు అధికారులు అనుమతి ఇచ్చేవారు. అంటే.. ఇద్దరు లాయర్లతో రోజుకు రెండు సార్లు బాబు ములాఖత్ అయ్యేవారు అన్నమాట. కానీ.. ఇకపై రోజుకు ఒకటే లీగల్ ఇంటర్వ్యూ (ములాఖత్) ఉంటుందని జైళ్ల శాఖ డీఐజీ రవికిరణ్ ఉత్తర్వులిచ్చారు. అయితే.. కుటుంబ సభ్యులు, స్నేహితులను కలిసేందుకు వారానికి ఇస్తున్న రెండు ములాఖత్‌ల్లో మాత్రం ఎలాంటి కోత ఉండబోదని స్పష్టం చేశారు.
బాబుతో 2వేల మంది ఖైదీలకి ఇబ్బంది
చంద్రబాబు ప్రతి రోజూ లీగల్ ఇంటర్వ్యూల పేరుతో రెండు సార్లు లాయర్లను కలిసేందుకు స్నేహ బ్లాక్ నుంచి బయటికి వస్తారు. ఆ సమయంలో అతను స్నేహ బ్లాక్ నుంచి అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్‌కు వెళ్లే వరకూ జైల్లోని దాదాపు 2000 మంది ఖైదీల కదలికలను జైలు అధికారులు నిలిపివేస్తున్నారు. దాంతో వాళ్లు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. అలానే అధికారులకు కూడా పరిపాలన, భద్రతా పరమైన తలనొప్పి కూడా తప్పడం లేదు. దాంతో ఇకపై రోజుకు ఒక లీగల్ ఇంటర్వ్యూ మాత్రమే అని తేల్చి చెప్పేశారు.
రాహుల్ రీఎంట్రీ ఇచ్చిన గంటల్లోనే వివాదం
రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ రాహుల్ రీఎంట్రీ ఇచ్చిన మొదటి రోజే చంద్రబాబు లీగల్ ఇంటర్వ్యూలో కోత పడటంపై టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. నెల క్రితం బాబు ఆ జైలుకి రాగానే రాహుల్ వెంటనే లీవ్‌పై వెళ్లారు. దాంతో అధికారపక్షం ఒత్తిడి కారణంగానే అతను లీవ్ పెట్టినట్లు టీడీపీ ప్రచారం చేసింది. కానీ.. అతను సతీమణి ఆసుపత్రిలో చేరడం.. అనారోగ్యంతో మృతి చెందడంతో ఇన్నాళ్లు ఆయన సెలవులో ఉన్నారు. కానీ.. నిన్న మళ్లీ విధుల్లో చేరిన గంటల వ్యవధిలోనే మళ్లీ వివాదం రాజుకుంది.
టీడీపీ వింత వాదన.. ఇదేం లాజిక్?
చంద్రబాబుపై ప్రస్తుతం మూడు కేసులు ఉన్నాయి. దాంతో ప్రతిరోజూ మూడు లీగల్ ములాఖత్‌లు ఇవ్వాలని టీడీపీ డిమాండ్ చేస్తోంది. కానీ.. జైలు అధికారులు మాత్రం బాబు స్నేహ బ్లాక్ నుంచి వెలుపలికి వచ్చిన ప్రతిసారీ ఖైదీల కదలికలను నియంత్రించడం కష్టంగా ఉందని.. భద్రతా దృష్ట్యా కూడా అది ఇబ్బందేనని తేల్చి చెప్పేశారు. అయితే టీడీపీ ఈ విషయంపై న్యాయస్థానాల్లో పోరాడాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.