Telugu Global
Andhra Pradesh

మనిషి మారలేదు.. దళితులను మరోసారి అవమానించిన చంద్రబాబు

ఎడమచేతి వేలిముద్ర వేయించుకోవడానికి టిప్పర్‌ డ్రైవర్‌కు టికెట్‌ ఇచ్చాడు. గొప్పోడయ్యా... తప్పకుండా అభినందించాల్సిందే. ఆయన తెలివితేటలకు ధన్యవాదాలు. శభాష్‌’’ అంటూ తానేదో చాలా గొప్ప విషయాన్ని కనిపెట్టినట్లు చంద్రబాబు అన్నారు.

మనిషి మారలేదు.. దళితులను మరోసారి అవమానించిన చంద్రబాబు
X

గతంలో ఎస్సీలను అవమానించి విమర్శలు ఎదుర్కున్న టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గుణం మారలేదని మరోసారి రుజువు చేసుకున్నారు. ఎవరైనా ఎస్సీగా పుట్టాలని అనుకుంటారా అంటూ గతంలో ఆయన వ్యాఖ్యానించారు. తాజాగా అనంతపురం జిల్లా శింగనమలలో చంద్రబాబు ఎస్సీని అమానిస్తూ పక్కాగా దొరికిపోయారు. శింగనమల వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి మన్నెపాక వీరాంజనేయులును అవమానిస్తూ ఆయన వ్యాఖ్యలు చేశారు.

మన్నెపాక వీరాంజనేయులు టిప్పర్‌ డ్రైవర్‌ అనే విషయం అందరికీ తెలిసిందే. టిప్పర్‌ డ్రైవర్‌కు అసెంబ్లీ టికెట్‌ ఇచ్చిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పట్ల సర్వత్రా ప్రశంసలు కురుస్తుంటే చంద్రబాబు మాత్రం విమర్శించారు. పేదలను, దళితులను ఆయన ఎంత చిన్నచూపు చూస్తారనే విషయం మరోసారి బయటపడింది.

‘‘ఎమ్మెల్యే పద్మావతికి కాకుండా ఆమె భర్తకు కాకుండా వాళ్ల టిప్పర్‌ డ్రైవర్‌కు టికెట్‌ ఇచ్చారు. అవునా, నిజమేనా? ఎడమచేతి వేలిముద్ర వేయించుకోవడానికి టిప్పర్‌ డ్రైవర్‌కు టికెట్‌ ఇచ్చాడు. గొప్పోడయ్యా... తప్పకుండా అభినందించాల్సిందే. ఆయన తెలివితేటలకు ధన్యవాదాలు. శభాష్‌’’ అంటూ తానేదో చాలా గొప్ప విషయాన్ని కనిపెట్టినట్లు చంద్రబాబు అన్నారు. జగన్‌ ఏదో తప్పు చేశారని ఎగతాళి చేయడానికి ప్రయత్నించారు. ఆయనే బొక్కబోర్లా పడ్డారు.

వీరాంజనేయులు నిరక్షరాస్యుడు కాద‌నే విషయం చంద్రబాబు బుర్రకు తట్టలేదు. తెలుసుకోవడానికి కూడా ప్రయత్నించలేదు. వేలిముద్ర వేయించుకోవడానికి టిప్పర్‌ డ్రైవర్‌కు జగన్‌ టికెట్‌ ఇచ్చారని ఆయన వ్యాఖ్యానించారు. వీరాంజనేయులు ఉన్నత విద్యావంతుడనే విషయం ఆయనకు తెలియదు. ఆయన ఎంఏ చేశారు. చంద్రబాబు పేదల పట్ల, ఎస్సీల పట్ల ఎంత అవమానకరంగా వ్యవహరిస్తారో దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు. చదువుకున్న పేదలూ ఎస్సీలు కూడా చంద్రబాబు దృష్టిలో వేలిముద్రగాళ్లేనా? మతి చెడి చంద్రబాబు మాట్లాడుతున్నారు.

చంద్రబాబు వ్యాఖ్యలపై వీరాంజనేయులు తీవ్రంగా ప్రతిస్పందించారు. టీడీపీ పెత్తందార్ల పార్టీ కాబట్టి కోటీశ్వరులకు ఇస్తారని, తమది పేద పార్టీ కాబట్టి పేదలకు టికెట్లు ఇస్తారని ఆయన అన్నారు. తాను పేదవాడినైనందుకు, ఎస్సీ అయినందుకు, శింగనమల ప్రజలకు సేవ చేసే అవకాశం వచ్చినందుకు గర్వపడుతున్నానని ఆయన అన్నారు. పేదలు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీల పట్ల చంద్రబాబుకు చిన్నచూపు అని ఆయన అన్నారు. తమ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి లక్కప్ప ఉపాధి కూలీ అని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు

First Published:  29 March 2024 6:35 PM IST
Next Story