Telugu Global
Andhra Pradesh

చంద్రబాబు 'జాగ్రత్త' రాజకీయం.. ఎవరినీ వదలడం లేదు

వచ్చే ఎన్నికల్లో వీలైనన్ని పార్టీలతో జతకడితే కాని బలమైన వైసీపీని ఎదుర్కొలేమని చంద్రబాబు అనుకుంటున్నారు. ఈ సారి కనుక టీడీపీ అధికారంలోకి రాలేకపోతే పార్టీకి భవిష్యత్ ఉండదని చంద్రబాబు ఓ అంచనాకు వచ్చారు.

చంద్రబాబు జాగ్రత్త రాజకీయం.. ఎవరినీ వదలడం లేదు
X

నలబై ఏళ్ల రాజకీయ జీవితం.. 14 ఏళ్లు సీఎంగా చేసిన అనుభవం.. ఎంతో మంది దేశాధినేతలు, పారిశ్రామికవేత్తలతో పరిచయాలు ఉన్నాయని చెప్పుకునే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు. తెలుగుదేశం పార్టీని రెండు తెలుగు రాష్ట్రాల్లో తిరుగులేని శక్తిగా మార్చిన ఘనత ఆయనదే అని చెప్పుకోవచ్చు. ప్రధానులు, రాష్ట్రపతులను ఎంపిక చేశానని చంద్రబాబు చెప్పుకుంటారు. ఇక కేంద్ర రాజకీయాల్లో కూడా చక్రం తిప్పిన అనుభవం ఉందని స్వయంగా ప్రకటించుకున్నారు. అలాంటి వ్యక్తి.. గత ఎన్నికల్లో వైఎస్ జగన్ చేతిలో ఘోరంగా ఓడిపోయారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ ప్రాభవం కూడా వేగంగా మసకబారుతూ వచ్చింది. ఇప్పుడు ఆ పార్టీని జాతీయ నాయకులు కూడా పట్టించుకోవడం లేదు.

తెలంగాణలో టీడీపీకి ప్రస్తుతం స్థానం లేదు. అధికార టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్యే పోటీ ఉంటుందని పలు విశ్లేషణలు తెలియజేస్తున్నాయి. అంతేకాకుండా చంద్రబాబు కూడా గత కొన్నాళ్లుగా కేవలం ఏపీపైనే ఫోకస్ పెట్టారు. ఇన్నేళ్ల రాజకీయం వేరు.. ఇప్పుడు చేయబోయే రాజకీయం వేరని ఆయనే చెప్పుకుంటున్నారు. గతంలో ఎంతో ధీమాగా కనిపించిన చంద్రబాబులో.. ఆ ఉత్సహం కనిపించడం లేదు. రాబోయే ఎన్నికల్లో ఏపీలో తెలుగుదేశాన్ని అధికారం తీసుకొని రావడం బాబు ముందున్న తక్షణ లక్ష్యం. టీడీపీని తిరిగి రాష్ట్రంలో నిలబెట్టాలన్నా, తన కొడుకు నారా లోకేష్‌కు రాజకీయాల్లో భవిష్యత్ చూపించాలన్నా అసెంబ్లీ ఎన్నికలు కీలకం కానున్నాయి. పవన్ నేతృత్వంలోని జనసేన, కలిసొస్తే బీజేపీతో పొత్తు పెట్టుకొని ఎలాగైనా అధికారంలోకి రావాలని బాబు కష్టపడుతున్నారు.

గత ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు కేంద్రంలోని బీజేపీ కారణంగా కొన్ని ఇబ్బందులు పడ్డారు. ఆయన పార్టీకి ఆర్థికంగా అండగా ఉండే కొంత మందిపై సీబీఐ, ఈడీలతో బీజేపీ దాడులు చేయించింది. దీంతో ఎన్నికల సమయంలో ఆయన కాస్త ఇబ్బందిపడ్డారు. ఈ సారి మళ్లీ బీజేపీ నుంచి ఇబ్బందులు రాకూడదని ఆయన కోరుకుంటున్నారు. అందుకే అడగక ముందే రాష్ట్రపతి ఎన్నికలో ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ముకు చంద్రబాబు మద్దతు ఇచ్చారని చర్చ జరుగుతుంది. ఎన్డీయే, వైసీపీ బలంతో ద్రౌపది సునాయాసంగా గెలుస్తారు. అయితే ప్రతిపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాపై ఎంత భారీ మెజార్టీతో గెలిస్తే.. ఎన్డీయే పార్టీల్లో అంత ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అందుకే తమకు ఏ పార్టీ మద్దతు ఇస్తామన్నా బీజేపీ కాదనడం లేదు.

జనసేన ఎలాగో చంద్రబాబుతో చేతులు కలపడానికి సిద్ధంగా ఉంది. అయితే తాను అడిగితే బీజేపీ కూటమిలో కలుస్తుందో లేదో అనే అనుమానం ఉంది. వీళ్లను కూటమిలోకి తీసుకొని రావడానికి జనసేన ఒప్పిస్తుందనే నమ్మకంతో చంద్రబాబు ఉన్నారు. మరోవైపు వచ్చే ఎన్నికల్లో ఎవరు కలసి వచ్చినా.. చేర్చుకుందామనే చంద్రబాబు అనుకుంటున్నారు. ఎన్ని ఓట్లు ఉన్నాయో.. ఎన్ని సీట్లు గెలుస్తారో లేదో తెలియని కేఏ పాల్‌ను కూడా వదలకూడ‌ద‌ని చంద్రబాబు అనుకుంటున్నట్లు తెలుస్తున్నది. ఆయన ద్వారా వైసీపీకి దగ్గరైన క్రైస్తవుల ఓట్లను తమ వైపు తిప్పుకోవచ్చని అనుకుంటున్నారు. ఇక బీఎస్పీ, కమ్యునిస్టులను కూడా వదలకుండా ఉంటే.. తప్పకుండా మరిన్ని సీట్లు సాధించవచ్చని చంద్రబాబు నమ్మకం పెట్టుకున్నారు.

వచ్చే ఎన్నికల్లో వీలైనన్ని పార్టీలతో జతకడితే కాని బలమైన వైసీపీని ఎదుర్కొలేమని చంద్రబాబు అనుకుంటున్నారు. ఈ సారి కనుక టీడీపీ అధికారంలోకి రాలేకపోతే పార్టీకి భవిష్యత్ ఉండదని చంద్రబాబు ఓ అంచనాకు వచ్చారు. ప్రాంతీయ పార్టీలు సుదీర్ఘకాలం అధికారంలో లేకపోతే చాలా కష్టాలు ఎదుర్కోవల్సి వస్తుందని చంద్రబాబుకు కూడా తెలుసు. అందుకే కలవడానికి సిద్ధంగా ఉన్న పార్టీలను, వారి భావజాలాలు వేర్వేరుగా ఉన్నా.. ఒక్కతాటిపైకి తీసుకొని రావడానికి ప్రయత్నిస్తున్నట్లు చర్చ జరుగుతోంది. ఏదేమైనా 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు.. ఇప్పుడు చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నట్లే కననపడుతోంది. మరి ఆయన కొత్త వ్యూహాలు తిరిగి అధికారాన్ని కట్టబెడతాయో లేదో చూడాలి.

First Published:  16 July 2022 1:13 PM IST
Next Story