Telugu Global
Andhra Pradesh

ఓటమి బాటలో చంద్రబాబు కూటమి..!

బీజేపీ కనక బాబుతో చెయ్యి కలిపితే, కర్నూలు, గుంటూరు, కడపలాంటి మైనార్టీలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో పార్లమెంట్‌ సీట్లూ పోతాయి, అసెంబ్లీ సీట్లూ అయోమయంలో పడతాయి.

ఓటమి బాటలో చంద్రబాబు కూటమి..!
X

హమ్మయ్య..! ఎట్టకేలకు, చిట్ట చివరికి సీట్ల సర్దుబాటు జరిగింది. బాబు, పవన్‌ ఒక తాటిమీదికి వచ్చారు, ఒప్పందానికో రూపం ఇచ్చారు. 24 అసెంబ్లీ సీట్లు జనసేనకి కేటాయించారు. 94 స్థానాల్లో తెలుగుదేశం పోటీచేస్తుంది. బాగానేవుంది. అయితే బీజేపీతో పొత్తు ఉందో లేదో నేటికీ ఎటూ తేలలేదు. అందుకే 57 స్థానాలు ఆపివుంచారు. రెండో విడత జనసేనకి కొన్ని సీట్లు, ఎస్‌ అంటే బీజేపీకి మరికొన్ని సీట్లు పంచాలి, పవనూ చంద్రబాబూ ఎంత నిరీక్షించినా, ప్రాధేయపడినా బీజేపీ నోరుమెదపలేదు. పొత్తుకి ‘సై’ అనలేదు. బీజేపీ నో అంటే ఒక చిక్కు, ఎస్‌ అంటే మరో చిక్కు. అదీ టీడీపీ దుస్థితి.

బీజేపీ కనక బాబుతో చెయ్యి కలిపితే, కర్నూలు, గుంటూరు, కడపలాంటి మైనార్టీలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో పార్లమెంట్‌ సీట్లూ పోతాయి, అసెంబ్లీ సీట్లూ అయోమయంలో పడతాయి. జనసేన, టీడీపీ కలిసి పోటీ చేయడం ఖరారు అయింది గనక, మిగిలిన బీజేపీ దగ్గరే ఆట ఆగివుంది. చాలామటుకు ఓడిపోయే సీట్లే పవన్‌కి అంటగట్టారని అప్పుడే విమర్శలు మొదలయ్యాయి. మనం బలంగా ఉన్న సీట్లు జనసేనకి ఎలా ఇస్తారని కొందరు ‘దేశం’ నాయకులు కోపంతో ఊగిపోతున్నారు. ఇక బీజేపీతోనూ పొత్తు కుదిరితే, మరింత మంది టీడీపీ నాయకుల ఆశలు ఆవిరైపోతాయి. అసలు సమస్య ఏమిటంటే.. ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీకి అంతసీనూలేదు, అన్ని సీట్లూరావు. అనుభవంతో, గట్టి నిర్మాణంతో బలంగా ఉన్నది తెలుగుదేశం మాత్రమే. అంచేత జనసేనకి, బీజేపీకి ఉదారంగా సీట్లు పంచేస్తే, సొంత చేతులతో ఓటమిని కొనితెచ్చుకున్నట్లే అవుతుంది. తెలుగుదేశం ఓట్లు బీజేపీకి ట్రాన్స్‌ఫర్‌ అవ్వడం అంత తేలికేమీకాదు. అలాగే తెలుగుదేశం ఓట్లు పెద్ద ఎత్తున జనసేన అభ్యర్థులకు పడే అవకాశమూ లేదు. ఈ పచ్చి అవకాశవాద మూడు ముక్కలాటలో చివరికి బొక్కబోర్లాపడేది చంద్రబాబు నాయుడే కావచ్చు.

నిజానికి జనసేన, టీడీపీ మంచిజట్టు. అయితే వీళ్లిద్దరూ బీజేపీ అనే జాతీయ రౌడీని చూసి జడుసుకుంటున్నారు. పవన్‌ ముందుకి ముందే నరేంద్రమోడీ కాళ్ల మీద పడివున్నాడు. లేనిపోని కేసులూ, దాడులూ, జైళ్లూ ఎందుకని చంద్రబాబు కలుద్దాం అని బీజేపీకి కన్నుకొడుతున్నాడు. ఇంతకాలం సీట్లు పంచలేదుగా అనుకున్నాం. ఇదిగో ఇప్పుడు మొదలయ్యాయి సర్కస్‌ ఫీట్లు..!

పవన్‌ కళ్యాణ్‌ వస్తే పొలోమంటూ జనమన్నా వెళ్తారు. ఆంధ్రలో ప్రజాకర్షణ గల బీజేపీ నాయకుడు ఒక్కడూ లేడు. అయినా అదే బీజేపీని పట్టుకు వేలాడక తప్పదు. చూస్తుంటే, వీళ్ల రాజకీయ సర్కస్‌ అంతా జగన్మోహన్‌రెడ్డిని మళ్లీ గెలిపించడానికేనేమో అనిపిస్తోంది.

కాపు–కమ్మ–బీజేపీ అనే రాజకీయ కషాయం ప్రజలగొంతులో దిగడం చాలా కష్టం.

చివరికి ఈ రాజకీయ కషాయమే చంద్రబాబుకి ఎన్నికల విషాదంగా మారుతుందేమో, పవన్‌ కళ్యాణ్‌ సాక్షిగా..!

First Published:  25 Feb 2024 11:08 AM IST
Next Story