యువకులకు టికెట్లు అంటే.. ఓహో ఇలాంటి వాళ్లకా?
విజయనగరం జిల్లా పార్వతీపురం నియోజకవర్గానికి బోనెల విజయచంద్ర అనే యువకుడిని టీడీపీ ఇన్ చార్జ్ గా ప్రకటించారు, ఎలాంటి రాజకీయ వారసత్వం లేని విజయచంద్రకు యువత కోటాలో టికెట్ ఖరారు కావడం గొప్ప విషయమే అయినా అక్కడే ఓ చిన్న ట్విస్ట్ ఉంది.
టీడీపీలో ఈసారి యువతకే 40శాతం టికెట్లు అంటూ ఆమధ్య ఘనంగా ప్రకటించారు చంద్రబాబు. ఆ ప్రకటనతో టీడీపీలో యువనాయకులు కూడా సంతోషించారు, కానీ ఎక్కడో చిన్న సందేహం. సీనియర్ల వారసులకే టికెట్లు ఇచ్చి యువత కోటాలో కలిపేస్తారేమోనని అనుమానించారు. కానీ చంద్రబాబు వ్యూహం అదికాదు. వారసత్వంలేని యువనాయకులకు కూడా టికెట్లు ఖాయం చేస్తూ అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నారు. తాజాగా విజయనగరం జిల్లా పార్వతీపురం నియోజకవర్గానికి బోనెల విజయచంద్ర అనే యువకుడిని ఇన్ చార్జ్ గా ప్రకటించారు, అంటే అభ్యర్థిగా ప్రకటించినట్టే లెక్క. ఎలాంటి రాజకీయ వారసత్వం లేని విజయచంద్రకు యువత కోటాలో టికెట్ ఖరారు కావడం గొప్ప విషయమే అయినా అక్కడే ఓ చిన్న ట్విస్ట్ ఉంది.
అలాంటి యువతకే టికెట్లు..
నర్సీపురం గ్రామానికి చెందిన బోనెల విజయచంద్రకు పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ లేదు. కార్పొరేట్ కంపెనీల్లో భారీ వేతనంతో ఉద్యోగాలు చేసి, ఆ తర్వాత సొంతగా వ్యాపారాలు మొదలు పెట్టి ఆర్థికంగా బలపడిన వ్యక్తి. అదే ఆయన క్వాలిఫికేషన్ గా మారింది. చంద్రబాబు వ్యూహం కూడా ఇదే. యువత అంటే ఆర్థికంగా బలపడిన యువత అనేది లోగుట్టు. పార్టీకోసం డబ్బు పెట్టాలి, ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిని డబ్బుతో ఢీకొట్టాలి. అలాంటివారినే ఏరికోరి సెలక్ట్ చేస్తున్నారు చంద్రబాబు. పార్టీ జెండాలు మోసిన కార్యకర్తలు, సోషల్ మీడియాలో యుద్ధాలు చేసిన యువనాయకులు, ఇతరత్రా క్వాలిఫికేషన్లున్నా.. అంతిమంగా ఆర్థికంగా బలమైన నాయకులకే టికెట్లు ఖరారవుతున్నాయి. ఆర్థిక స్థోమత ఉంటే, అప్పటికప్పుడే పార్టీ కండువా కప్పి నియోజకవర్గ ఇన్ చార్జ్ లు గా ప్రకటిస్తున్నారు. దీనికి తాజా ఉదాహరణే పార్వతీపురం నియోజకవర్గం విజయచంద్ర వ్యవహారం.
పాత నాయకులు కలిసొస్తారా..?
బలమైన నాయకుల్ని చంద్రబాబు ఏరికోరి తీసుకొచ్చినా.. కొత్తవారితో పాత నాయకులు కలసి పనిచేస్తారా లేదా అనేది అనుమానమే. పార్వతీపురం నియోజకవర్గంలో ఇప్పటి వరకూ బొబ్బిలి చిరంజీవులు, టీడీపీ ఇన్ చార్జ్ గా ఉన్నారు. సడన్ గా ఆ పోస్ట్ మార్చేయడంతో ఆయన అలిగినట్టు సమాచారం. 2014 ఎన్నికల్లో టీడీపీ టికెట్ పై గెలిచిన చిరంజీవులు.. 2019లో మాత్రం వైసీపీ అభ్యర్థి అలజంగి జోగారావు చేతిలో ఓడిపోయారు. ఈసారి కూడా అక్కడ జోగారావే వైసీపీ అభ్యర్థి అంటున్నారు. ఆర్థికంగా ఆయన్ను ఢీకొట్టాలంటే విజయచంద్ర సరైన అభ్యర్థి అని చంద్రబాబు నమ్మకం. మరి విజయచంద్రకు, చిరంజీవులు ఏమేరకు సహకరిస్తారనేది వేచి చూడాలి.