అబద్ధాలతో కాపులను వంచించిన చంద్రబాబు.. ధైర్యం చేసి నిజం చెప్పిన జగన్
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాపుల సమస్యపై శాసనసభలో జరిగిన చర్చలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆ విషయంపై స్పష్టంగానే చెప్పారు.
టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చాలా తెలివిగా ఆంధ్రప్రదేశ్‌లోని కాపులను వంచించారు. కాపులకు విద్య, ఉద్యోగాల్లో 5 శాతం రిజర్వేషన్లు కల్పిస్తానని 2014 ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత చాలాకాలం దాని ఊసే ఎత్తలేదు. కాపు నేత ముద్రగడ పద్మనాభం నాయకత్వంలో కాపులు ఆందోళనకు దిగడంతో ఆయనలో కదలిక వచ్చింది. అప్పుడు వారిని బుజ్జగించడానికి చంద్రబాబు మంచి ఎత్తు వేశాడు. కాపులకు ఐదు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ శాసనసభలో బిల్లు పాస్ చేయించుకున్నారు. దాన్ని రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్‌లో చేర్చాలని కోరుతూ కేంద్రానికి పంపించారు.
కాపులకు 5 శాతం రిజర్వేషన్లు కల్పించడంతో రాష్ట్రంలోని మొత్తం రిజర్వేషన్ల శాతం 55కు చేరుకుంది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదు. అందుకే కాపు రిజర్వేషన్లను 9వ షెడ్యూల్‌లో చేర్చాలని చంద్రబాబు కేంద్రాన్ని అభ్యర్థించారు. అయితే, కేంద్రం దానిపై సానుకూలంగా స్పందించలేదు. కేంద్రం సమ్మతించదన్న విషయం చంద్రబాబుకు తెలియదని అనుకోవడం పొరపాటే. చాలా రాష్ట్రాల్లో వివిధ వర్గాలు రిజర్వేషన్లు కల్పించాలని ఆందోళనలు చేస్తున్నాయి. కాపు రిజర్వేషన్లను 9వ షెడ్యూల్‌లో చేరిస్తే అంతటితో ఆగదని కేంద్రానికి తెలుసు. ఆ డిమాండ్లు ఇతర రాష్ట్రాల నుంచి కుప్పలు తెప్పలుగా వచ్చే అవకాశం ఉంది. అందుకే కాపు రిజర్వేషన్లపై కేంద్రం సానుకూలంగా స్పందించలేదు.
మరోసారి కాపులను వంచించడానికి చంద్రబాబు ఎత్తుగడ వేశారు. కేంద్రం ఆర్థికంగా బలహీనంగా ఉన్న వర్గాలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించింది. అందులో 5 శాతం కాపులకు కేటాయిస్తున్నట్లు చంద్రబాబు ఎన్నికలకు ముందు 2019లో చెప్పారు. అయితే, అవి కుల ప్రాతిపదికపై ఏర్పాటు చేసిన రిజర్వేషన్లు కావు. దాంతో కాపులకు చంద్రబాబు ఈడబ్ల్యుఎస్ కోటాలో కేటాయించిన రిజర్వేషన్లు చెల్లుబాటు కాలేదు. కాపులను బీసీల్లో చేరుస్తామని కూడా ఆయన హామీ ఇచ్చారు. అది గాలిలోనే కొట్టుకుపోయింది, బీసీలు ఎదురు తిరగడంతో చంద్రబాబు వెనక్కి తగ్గారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాపుల సమస్యపై శాసనసభలో జరిగిన చర్చలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆ విషయంపై స్పష్టంగానే చెప్పారు. ఈడబ్ల్యుఎస్ కోటాలో కాపులకు రిజర్వేషన్లు ఇవ్వడం కుదరదని అన్నారు. నిజానికి కాపు రిజర్వేషన్ల విషయంలో వైఎస్ జగన్ ఎంతో ధైర్యాన్ని ప్రదర్శించారు. 2019 ఎన్నికల ప్రచారంలో వైఎస్ జగన్ కాపులకు రిజర్వేషన్లు కల్పించడమనేది తన చేతుల్లో లేదని, అందువల్ల తాను కాపులకు రిజర్వేషన్లు ఇస్తానని హామీ ఇవ్వలేనని చెప్పారు. ఎన్నికలకు ముందు ఆ విధమైన ప్రకటన చేయడం జగన్ ధైర్యమే. అయినప్పటికీ వైఎస్ జగన్ ఎన్నికల్లో గెలిచారు.
తాను అధికారంలోకి వచ్చిన తర్వాత మరో విధంగా కాపులను ఆదుకోవడానికి జగన్ ప్రయత్నించారు. ఆయన కాపు నేస్తం పథకాన్ని అమలులోకి తెచ్చారు. కాపులకు చంద్రబాబు కేటాయించిన నిధుల కన్నా ఎక్కువ నిధులు కేటాయించారు. కాపు కార్పోరేషన్‌ను ఏర్పాటు చేశారు.
కాపులను బూటకపు వాగ్దానాలతో వంచించిన చంద్రబాబును అధికారంలోకి తేవడానికి జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పడరాని పాట్లు పడుతున్నారు. ఇది ఎంత వరకు సమంజసమనేది ప్రశ్న.