‘అప్పుడు వినలేదు, ఇప్పుడు పాకులాడుతున్నాడు’
వెంకయ్యనాయుడు చేసిన రెండు సూచనలను కూడా చంద్రబాబు పట్టించుకోలేదు. ఆయన సూచనలకు విరుద్ధంగా వ్యవహరించారు.

ఎన్డీఏ నుంచి వైదొలగొద్దని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు చెప్పిన మాటలను టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు 2019 ఎన్నికలకు ముందు వినలేదు. బీజేపీతో తెగదెంపులు చేసుకోవడమే కాకుండా ప్రధాని మోడీపై తీవ్రస్థాయిలో వ్యక్తిగత విమర్శలు చేశారు. కాంగ్రెస్ నాయకులతో వేదికలు పంచుకున్నారు. ఇప్పుడేమో బీజేపీతో పొత్తు కోసం పాకులాడుతున్నారు. ప్రధాన మంత్రి మోడీని తీవ్రంగా వ్యతిరేకించి బీజేపీతో తెగదెంపులు చేసుకోవడమే 2019 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవడానికి కారణమని వెంకయ్యనాయుడు అన్నారు. ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన చంద్రబాబు తన మాట వినకపోవడం గురించి వివరించారు.
2018లో ఎన్డీఏ నుంచి టీడీపీ వైదొలగడానికి సిద్ధపడిన సమయంలో గుంటూరులో చంద్రబాబు తనను కలిశారని, ఎన్డీఏలో కొనసాగాలని తాను చంద్రబాబుకు చెప్పానని, ఒప్పించడానికి ప్రయత్నించానని, అయితే చంద్రబాబు అంగీకరించలేదని ఆయన చెప్పారు. ఎన్డీఏలో కొనసాగితే టీడీపీకి ఆంధ్రప్రదేశ్‌లో గెలిచే అవకాశాలు తగ్గుతాయని టీడీపీ భావించింది. బీజేపీపై ప్రజల్లో తీవ్రమైన అసంతృప్తి ఉందని, అందువల్ల ఎన్డీఏ నుంచి వైదొలగడమే మంచిదని భావిస్తున్నానని చంద్రబాబు అన్నట్లు వెంకయ్య నాయుడు తెలిపారు.
ఎన్డీఏ నుంచి వైదొలిగితే ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో రెండు పనులు చేయవద్దని చంద్రబాబుకు సూచించానని, ఒకటి.. నరేంద్ర మోడీపై వ్యక్తిగత విమర్శలు చేయవద్దని, రెండు... కాంగ్రెస్ ప్రెసిడెంట్ కలవకూడదని తాను చేసిన సూచనలు అని ఆయన వివరించారు. అయితే, వెంకయ్యనాయుడు చేసిన రెండు సూచనలను కూడా చంద్రబాబు పట్టించుకోలేదు. ఆయన సూచనలకు విరుద్ధంగా వ్యవహరించారు. పార్టీ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని తాను ఆ సూచనలు చేశానని, చంద్రబాబు తన సూచనలు ఆచరించకపోవడంతో ఫలితం అనుభవించారని ఆయన అన్నారు.
అప్పట్లో వెంకయ్యనాయుడు సూచనలను పెడచెవిన పెట్టిన చంద్రబాబు. ఇప్పుడు జరగబోయే ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఆయన ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయనేది వేచి చూడాల్సిందే.