'తాట తీస్తా'.. కర్నూలు పర్యటనలో చంద్రబాబు వార్నింగ్
సీఎంగా అధికారంలో ఉన్నప్పుడు ఎలాంటి పరుష పదజాలాన్ని ఉపయోగించే వారో.. అలాంటి మాటలే తిరగి మాట్లాడుతున్నారు. ఈ సారి ఏకంగా 'తాట తీస్తా' అంటూ ఆందోళనకారులను బెదిరించారు.
కర్నూలు పర్యటనలో చంద్రబాబులోని అనేక రూపాలు బయటపడుతున్నాయి. మొన్న.. 'నాకు ఇవే చివరి ఎన్నికలు' తమ్ముళ్లూ అంటూ బాధపడి.. తనకు ఓటేయాలని వేడుకున్నారు. ఈసారి గెలిపించకపోతే ఇక నేను రాజకీయాలకు దూరం అవుతానంటూ ఆందోళన వ్యక్తం చేశారు. బాబు ఆవేదనగా మాట్లాడిన మాటలు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారాయి. కానీ 48 గంటలు గడిచే సరికి బాబులోని అసలు మనిషి బయటకు వచ్చాడు. సీఎంగా అధికారంలో ఉన్నప్పుడు ఎలాంటి పరుష పదజాలాన్ని ఉపయోగించే వారో.. అలాంటి మాటలే తిరిగి మాట్లాడుతున్నారు. ఈ సారి ఏకంగా 'తాట తీస్తా' అంటూ ఆందోళనకారులను బెదిరించారు.
ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు శుక్రవారం కూడా కర్నూలు జిల్లాలో తన పర్యటన కొనసాగిస్తున్నారు. కర్నూలు నగరంలోని టీడీపీ ఆఫీస్ వద్ద చంద్రబాబు సభను ఏర్పాటు చేశారు. అయితే, రాయలసీమకు చంద్రబాబు ద్రోహం చేశారని.. గో బ్యాక్ చంద్రబాబు నాయుడు అంటూ ప్లకార్డులు పట్టుకొని న్యాయవాదులు ఆందోళనకు దిగారు. కర్నూలుకు హైకోర్టు రాకుండా చంద్రబాబే అడ్డుకుంటున్నాడంటూ వాళ్లు నిరసన చేపట్టారు. గో బ్యాక్ చంద్రబాబు నినాదాలతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లిపోయింది.
నిరసన చేపట్టిన న్యాయవాదులను ఉద్దేశించి చంద్రబాబు పరుషంగా మాట్లాడారు. అక్కడే ఉన్న తెలుగు దేశం కార్యకర్తలను రెచ్చగొడుతూ.. 'ఇప్పుడే మన ఆఫీసు విషయం అయిపోయింది. ఇప్పుడే వాళ్లకు బుద్ధి చెప్పాను. మా ఆఫీసుకే వస్తారా? బుద్ధుండేవాడు, జ్ఞానముండేవాడు అయితే ఇక్కడకు రాకూడదు. వస్తే ఇక మీరే చూసుకోండి. మీ వల్ల కాకపోతే నాకు చెప్పండి. అప్పుడు నేనే వస్తా.. తాట తీస్తా' అంటూ మాట్లాడారు. అంతే కాకుండా ఆందోళనకారులను మామూలుగా వదిలిపెట్టనని, అవసరం అయితే కర్నూలులోనే బస చేస్తానని.. ఎవడేం చేస్తాడో చూస్తానని రెచ్చ గొడుతూ మాట్లాడారు.
ఒకవైపు ఆందోళనకారులు, మరోవైపు చంద్రబాబు వ్యాఖ్యలతో రెచ్చిపోయిన తెలుగుదేశం కార్యకర్తల మధ్య పూర్తి ఘర్షణ వాతావరణం నెలకొన్నది. అక్కడ ఇరు వర్గాల మధ్య ఉద్రిక్త పరిస్థితి ఏర్పడటంతో పోలీసులు వారిని చెదరగొట్టారు. కొంత మంది ఆందోళనకారులు ప్లకార్డులు పట్టుకొని చంద్రబాబు కాన్వాయ్ ముందుకు వెళ్లడానికి ప్రయత్నించారు. అయితే పోలీసులు వారిని పక్కకు నెట్టారు. మొత్తానికి శాంతియుతంగా తన నిరసన తెలుపుతున్న ఆందోళనకారులపై చంద్రబాబు కావాలనే తెలుగు దేశం కార్యర్తలను రెచ్చగొట్టారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఒక రోజు ముందు ఎంతో దీనంగా అభ్యర్థించిన చంద్రబాబు తన అసలు బుద్దిని బయటపెట్టుకున్నారని పలువురు విమర్శిస్తున్నారు.