Telugu Global
Andhra Pradesh

మళ్లీ సోమవారం.. మళ్లీ పోలవారం

ఇరిగేషన్ శాఖ అధికారులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు సీఎం చంద్రబాబు. పోలవరం ప్రాజెక్టు సహా రాష్ట్రంలోని వివిధ ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణాల స్టేటస్ అడిగి తెలుసుకున్నారు.

మళ్లీ సోమవారం.. మళ్లీ పోలవారం
X

టీడీపీ హయాంలో సోమవారానికి పోలవారం అనే పేరు పెట్టి ఎక్కడలేని హడావిడి చేశారు, తీరా ప్రాజెక్ట్ పూర్తి కాలేదు. వైసీపీ హయాంలో అడుగులు మందుకు పడినా పని మాత్రం పూర్తి కాలేదు. ఇప్పుడు మళ్లీ టీడీపీ అధికారంలోకి వచ్చింది. పోలవరం ప్రాజెక్ట్ పేరుతో హడావిడి మళ్లీ మొదలైంది. ఈ సోమవారం సీఎం చంద్రబాబు పోలవరం ప్రాజెక్ట్ ని సందర్శిస్తారని, అలా మళ్లీ సోమవారం-పోలవారం సెంటిమెంట్ మొదలవుతోందని చెబుతున్నారు.

అధికారంలో ఉన్నప్పుడు పోలవరం ప్రాజెక్ట్ పై చంద్రబాబు 83 సార్లు సమీక్ష చేశారని సమాచారం. ఆ విషయాన్ని ఆయనే చాలా సార్లు గొప్పగా చెప్పుకున్నారు. ఆ తర్వాత వైసీపీ హయాంలో పనులు ముందుకు సాగలేదని విమర్శించారు కూడా. తిరిగి ఇప్పుడు అధికారంలోకి వచ్చాక పోలవరం ప్రాజెక్ట్ పై ఆయన ప్రత్యేక దృష్టిపెట్టారంటూ కథనాలు వెలువడుతున్నాయి. ఇరిగేషన్ శాఖ అధికారులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు సీఎం చంద్రబాబు. పోలవరం ప్రాజెక్టు సహా రాష్ట్రంలోని వివిధ ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణాల స్టేటస్ అడిగి తెలుసుకున్నారు. సోమవారం పోలవరం ప్రాజెక్ట్ సందర్శన ఉంటుందని అంటున్నారు. అక్కడినుంచే చంద్రబాబు గత ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధిస్తారని తెలుస్తోంది.

మేమే పూర్తి చేస్తాం..

గతంలో వైసీపీ మంత్రులు పోలవరాన్ని కచ్చితంగా తామే పూర్తి చేస్తామని చెప్పేవారు. అసెంబ్లీలో గత మంత్రుల ప్రసంగాలు ఇంకా సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. ఇప్పుడు టీడీపీ కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం విశేషం. సీఎం చంద్రబాబు, జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు హయాంలోనే పోలవరం ప్రాజెక్ట్ పూర్తతుందని అన్నారు మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్. నిమ్మలకు జల వనరుల శాఖను కేటాయించిన సందర్భంగా పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో రైతు సంఘాల ఆధ్వర్యంలో కాటన్ దొర విగ్రహానికి పూలమాలవేసి కేక్ కట్ చేశారు. టీడీపీ హయాంలోనే పోలవరం పూర్తవుతుందని ధీమా వ్యక్తం చేశారు.

First Published:  15 Jun 2024 7:46 AM IST
Next Story