Telugu Global
Andhra Pradesh

చంద్రబాబు ఎత్తుగడ ఎదురు తన్నిందా? సీమ పర్యటనతో సాధించిందేంటి?

మూడు రాజధానులు వద్దని.. అమరావతి మాత్రమే రాజధానిగా ఉండాలని సీమ ప్రజల నోటి నుంచే చెప్పించాలని ఆయా చోట్ల నిర్వహించిన రోడ్ షోలలో చంద్రబాబు తెగ ప్రయాసపడ్డారు.

చంద్రబాబు ఎత్తుగడ ఎదురు తన్నిందా?    సీమ పర్యటనతో సాధించిందేంటి?
X

గత కొన్నిరోజులుగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ..రాయలసీమ ప్రాంతంలోని కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. 2019 ఎన్నికల్లో టీడీపీ ఇక్కడ గట్టిగా దెబ్బతిన్నది. సీమ ప్రాంతంలో పెద్దగా ప్రభావం చూపలేదు. మరోవైపు ప్రస్తుతం జగన్ సర్కారు కర్నూలుకు న్యాయ రాజధాని తీసుకొద్దామని చూస్తుంటే.. చంద్రబాబు అడ్డుకుంటున్నారని ప్రజలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో సీమలో కనీసం పట్టు నిలుపుకుందామని చంద్రబాబు వ్యూహాలు రచించారు. అందులో భాగంగానే కర్నూలు జిల్లాలో పర్యటించారు. మూడు రాజధానులు వద్దని.. అమరావతి మాత్రమే రాజధానిగా ఉండాలని సీమ ప్రజల నోటి నుంచే చెప్పించాలని ఆయా చోట్ల నిర్వహించిన రోడ్ షోలలో చంద్రబాబు తెగ ప్రయాసపడ్డారు.

అయితే కొంత మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మినహా.. ప్రజల నుంచి పెద్దగా బాబుకు మద్దతు దక్కినట్టు లేదు. దీంతో రాయలసీమ ప్రాంతానికి హైకోర్టు బెంచ్ తీసుకురావడానికి తాను ప్రయత్నించినట్టు చంద్రబాబు చెప్పుకున్నారు. పనిలో పనిగా ఈ ప్రాంతానికి జగన్ ఏమీ చేయలేదని పాత ఆరోపణలు మళ్లీ గుప్పించారు. మొత్తంగా రాయలసీమ ప్రాంతవాసులను ఆకట్టుకోవాలని.. అమరావతికి మద్దతు పలికించాలని చంద్రబాబు చేసిన ప్రయత్నం పెద్దగా ఫలించినట్టు లేదు.

మూడు రాజధానుల విషయంలో ప్రభుత్వాన్ని అప్రదిష్ఠ పాలు చేయడానికి చంద్రబాబు, ఆయన అనుకూల మీడియా తెగ ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. విశాఖను రాజధానిగా చేయాలన్నదే తమ ప్రభుత్వ విధానం అని మంత్రులు గట్టిగా చెప్పిన ప్రతిసారి.. ఆ విషయం ప్రజల్లోకి వెళ్లకుండా విశాఖను వైసీపీని దోచుకుంటోందని ఓ వర్గం మీడియా, టీడీపీ విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి.

కాగా, రాయలసీమలో మాత్రం .. ప్రస్తుతం న్యాయ రాజధాని రాకుండా టీడీపీ అడ్డుకుంటున్నదని జనం బలంగా నమ్ముతున్నారు. దీంతో వారిని తప్పుదోవ పట్టించేందుకు చంద్రబాబు బాగానే ప్రయత్నం చేశారు. ఆయన ప్రయత్నాలను జనం పెద్దగా పట్టించుకోలేదు. చంద్రబాబు సభల్లో జనం స్పందన చూస్తుంటే ఈ విషయం అర్థమవుతోంది. కానీ అనుకూల మీడియా మాత్రం .. రోడ్ షోలు సక్సెస్ అయినట్టు, చంద్రబాబు మాటలు జనం నమ్మినట్టు వార్తలు, కథనాలు వండివార్చాయి. చంద్రబాబును జనం ఏ మేర నమ్ముతున్నారో తెలుసుకోవాలంటే వచ్చే ఎన్నికల దాకా వేచి చూడక తప్పదు.

First Published:  19 Nov 2022 1:08 PM IST
Next Story