చంద్రబాబు ట్వీట్.. రజినీకాంత్ ని మళ్లీ తిట్టిస్తారా..?
చంద్రబాబు ట్వీట్ దేనికోసం. నిజంగానే రజినీకాంత్ కి క్షమాపణ చెప్పించడానికా..? లేక వైసీపీ నేతల్ని రెచ్చగొట్టి మరీ తిట్టించడానికా..?
"రజినీకాంత్ ని అనవసరంగా తిట్టారు, ఆయనకు వెంటనే సారీ చెప్పండి.."
చంద్రబాబు ట్వీట్ వేయగానే వైసీపీ నేతలు నిజంగానే సారీ చెబుతారా..? సారీ చెప్పకపోగా ఇంకాస్త రెట్టించే అవకాశముంది. పోయినసారి రజినీ ఎపిసోడ్ లో కలుగజేసుకోనివారు కూడా ఈసారి తిట్ల దండకం అందుకునే ప్రమాదముంది. మరి చంద్రబాబు ట్వీట్ దేనికోసం. నిజంగానే రజినీకాంత్ కి క్షమాపణ చెప్పించడానికా..? లేక వైసీపీ నేతల్ని రెచ్చగొట్టి మరీ తిట్టించడానికా..?
ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల సందర్భంగా పుస్తకావిష్కరణకు వచ్చిన రజినీకాంత్ ఎన్టీఆర్ ని ఆకాశానికెత్తేశారు, పనిలో పనిగా చంద్రబాబుని పొగడ్తల్లో ముంచెత్తారు. దీంతో సహజంగానే వైసీపీ నేతలకు మండింది. రజినీకాంత్ ని చెడామడా తిట్టేశారు. వెన్నుపోటుదారుడని, మోసగాడని, రోగిష్టి అని.. నానా మాటలన్నారు. ఈ ఎపిసోడ్ కాస్త చల్లారుతుందనుకుంటున్న టైమ్ లో మళ్లీ చంద్రబాబు ట్వీట్ వేసి వైసీపీ నేతల్ని రెచ్చగొట్టారు. దీంతో సెకండ్ ఎపిసోడ్ లో కూడా రజినీకి కోటింగ్ తప్పదని తేలిపోయింది.
అన్నగారి శత జయంతి కార్యక్రమంలో పాల్గొని ఆయనతో తన అనుబంధాన్ని...అనుభవాలను పంచుకున్న సూపర్ స్టార్ @rajinikanth గారిపై వైసీపీ మూకల అసభ్యకర విమర్శల దాడి అభ్యంతరకరం, దారుణం. సమాజంలో ఎంతో గౌరవం ఉండే రజనీ కాంత్ లాంటి లెజెండరీ పర్సనాలటీపై కూడా వైసీపీ నేతలు చేస్తున్న నీచ వ్యాఖ్యలు అందరికీ… pic.twitter.com/CjyhyviDNb
— N Chandrababu Naidu (@ncbn) May 1, 2023
ఇంతకీ చంద్రబాబు ఏమన్నారు..?
రజినీకాంత్ పై వైసీపీ మూకల అసభ్యకర విమర్శల దాడి అభ్యంతరకరం, దారుణం అంటూ ట్వీట్ వేశారు చంద్రబాబు. సమాజంలో ఎంతో గౌరవం ఉండే రజినీ కాంత్ లాంటి లెజెండరీ పర్సనాలటీపై వైసీపీ నేతలు చేస్తున్న నీచ వ్యాఖ్యలు అందరికీ బాధ కలిగిస్తున్నాయని చెప్పారు. వైసీపీ ప్రభుత్వ పోకడలపై ఆయన చిన్న విమర్శ చేయలేదని, ఎవరినీ పల్లెత్తు మాట అనలేదని, పలు అంశాలపై ఆయన అభిప్రాయాలు మాత్రమే చెప్పారని గుర్తుచేశారు. అయినా అహంకారంతో ఆయనపై వైసీపీ నేతలు అర్థం లేని విమర్శలు చేశారని మండిపడ్డారు. రజినీ క్యారెక్టర్ పై వైసీపీ నేతల విమర్శలు ఆకాశం పై ఉమ్మి వేయడం లాంటివన్నారు. నోటిదూల నేతలను జగన్ అదుపులో పెట్టుకోవాలని, జరిగిన దానికి క్షమాపణ చెప్పి తప్పు సరిదిద్దుకోవాలని సూచించారు.
చంద్రబాబు ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది. దీనికి వైసీపీ నుంచి రియాక్షన్లు ఇంకా మొదలు కాలేదు. మొదలైతే.. క్షమాపణలు చెప్పకపోగా.. ఈసారి రజినీతోపాటు, చంద్రబాబుకి కూడా చాకిరేవు తప్పనిసరి. అంటే పరోక్షంగా వైసీపీ నేతల్ని రెచ్చగొట్టి మరీ రజినీపై తిట్లదండకం చదివేలా చేస్తున్నారనమాట చంద్రబాబు.