Telugu Global
Andhra Pradesh

చంద్రబాబు 'యాత్ర'.. అసంతృప్తులే టార్గెట్

వైసీపీలో మార్చాల్సింది ఎమ్మెల్యేలను కాదని, సీఎంని అని అన్నారు చంద్రబాబు. అమాయకపు ఎమ్మెల్యేలను తీసేసి తానో గొప్ప నాయకుడని సీఎం జగన్ అనుకుంటున్నారని కౌంటర్ ఇచ్చారు.

చంద్రబాబు యాత్ర.. అసంతృప్తులే టార్గెట్
X

జైలునుంచి బయటకొచ్చిన తర్వాత చంద్రబాబు పూర్తి స్థాయిలో రాజకీయాలపై ఫోకస్ పెంచారు. పార్టీ నేతలతో మీటింగ్, యువగళం బహిరంగ సభ, కుప్పం పర్యటన తర్వాత ఆయన మరోసారి జనంలోకి వెళ్లబోతున్నారు. ఈసారి పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా ఆయన యాత్ర కొనసాగుతుంది. దీనికోసం ఇప్పటికే షెడ్యూల్ ఖరారైంది. తొలి విడత, 7 ప్రాంతాల్లో బాబు 'యాత్ర' షెడ్యూల్ విడుదల చేశారు. జనవరి 5న కనిగిరి, 7వతేదీ తిరువూరు, ఆచంట, 9వతేదీ వెంకటగిరి, ఆళ్లగడ్డ, 10వతేదీన పెద్దాపురం, టెక్కలి ప్రాంతాల్లో చంద్రబాబు బహిరంగ సభలు జరుగుతాయి. తొలి విడత వచ్చే స్పందనతో రెండో విడత షెడ్యూల్ ఖరారు చేస్తారు. జనవరి 29 నాటికి 25 సభలు పూర్తిచేసేలా రూట్ మ్యాప్ రెడీ అవుతోంది.

వైసీపీ అసంతృప్తులే టార్గెట్ గా చంద్రబాబు యాత్ర కొనసాగుతుందని తెలుస్తోంది. ఇప్పటికే చాలామంది నేతలు వైసీపీపై అసంతృప్తితో ఉన్నారు. కొంతమంది జనసేన బాట పట్టారు కూడా, గతంలో నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీవైపు వచ్చినా.. ఈ దఫా ఇంకా చేరికలు మొదలు కాలేదు. చంద్రబాబు బహిరంగ సభల్లో చేరికలు కూడా ఉండేటట్టు ప్లాన్ చేస్తున్నారు. పెద్ద స్థాయి నేతలకు గేలం వేస్తున్నారు. ఆ గేలానికి వారు దొరక్క పోయినా చోటా మోటా నేతలకు టీడీపీ కండువాలు కప్పి సభల్లో హడావిడి సృష్టించాలనుకుంటున్నారు.

కుప్పంలో చరిత్ర తిరగరాస్తా..

ఈసారి వైనాట్ కుప్పం అని వైసీపీ ధీమాగా ఉంది. కుప్పం నుంచి చంద్రబాబుని తరిమేస్తామంటున్నారు వైసీపీ నేతలు. అయితే చంద్రబాబు మాత్రం ఈసారి తన మెజార్టీ భారీగా పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. జైలుకి వెళ్లొచ్చిన తర్వాత తొలిసారి కుప్పం నియోజకవర్గంలో పర్యటించిన చంద్రబాబు ఈ దఫా తనకు లక్ష ఓట్ల మెజారిటీ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వైసీపీ సినిమా అయిపోయిందని.. ఇక 100 రోజులే సమయం ఉందన్నారు. వైసీపీలో మార్చాల్సింది ఎమ్మెల్యేలను కాదని, సీఎంని అని అన్నారు చంద్రబాబు. అమాయకపు ఎమ్మెల్యేలను తీసేసి తానో గొప్ప నాయకుడని సీఎం జగన్ అనుకుంటున్నారని కౌంటర్ ఇచ్చారు. ఐదేళ్లలో ఒక్క స్టేడియం కూడా కట్టకుండా ఆడుదాం ఆంధ్రా అంటున్నారని.. దోచుకుందాం-దాచుకుందాం అనే ఆట పెడితే వారికి సరిగ్గా సరిపోతుందని విమర్శించారు.

First Published:  29 Dec 2023 7:37 AM IST
Next Story