Telugu Global
Andhra Pradesh

కుప్పంలో రెండో రోజు సందడి.. స్వయంగా అర్జీలు తీసుకున్న సీఎం

చంద్రబాబు నేరుగా ప్రజల వద్దకు వెళ్లి వారిని పలకరించారు. అర్జీలు తానే స్వయంగా తీసుకున్నారు.

కుప్పంలో రెండో రోజు సందడి.. స్వయంగా అర్జీలు తీసుకున్న సీఎం
X

సొంత నియోజకవర్గం కుప్పంలో సీఎం చంద్రబాబు రెండోరోజు పర్యటన సందడిగా సాగింది. ప్రజలనుంచి నేరుగా ఆయన వినతిపత్రాలు స్వీకరించారు. చంద్రబాబుని చూసేందుకు జనం తరలి వచ్చారు. స్థానిక ఆర్అండ్‌బి గెస్ట్ హౌస్ లో బస చేసిన ఆయన, నేరుగా ప్రజల వద్దకు వెళ్లి వారిని పలకరించారు. అర్జీలు తానే స్వయంగా తీసుకున్నారు. వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్‌, అధికారులను చంద్రబాబు ఆదేశించారు.

ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కుప్పం వచ్చిన చంద్రబాబు మరో జన్మలో కూడా తనకు కుప్పంలోనే పుట్టాలని ఉందన్నారు. కుప్పం ప్రజలపై వరాల జల్లు కురిపించారు. ఔటర్‌ రింగ్ రోడ్డు వేస్తామని, అన్ని రోడ్లు అభివృద్ధి చేస్తామని చెప్పారు. కుప్పం మున్సిపాల్టీకి 100 కోట్ల రూపాయలకు పైగా నిధులు కేటాయిస్తామన్నారు. నియోజకవకర్గ పరిధిలో నాలుగు మండలాలకు పదికోట్ల రూపాయల చొప్పున కేటాయిస్తామన్నారు. ప్రతి ఇంటికి తాగునీరు అందిస్తామని, కుప్పంను పచ్చదనానికి కేరాఫ్ అడ్రస్ గా మారుస్తామని ప్రకటించారు చంద్రబాబు.

సీఎంగా ఉన్నా, ప్రతిపక్ష నేతగా ఉన్నా కూడా చంద్రబాబు కుప్పంను పట్టించుకోలేదని గతంలో వైసీపీ తీవ్ర ఆరోపణలు చేసింది. కుప్పం ప్రజలకు హంద్రీనీవా నీటిని ఇచ్చింది కూడా జగనేనని ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో తాజాగా చంద్రబాబు సొంత నియోజకవర్గంపై ఫోకస్ పెట్టారు. పెద్ద ఎత్తున కుప్పంలో అభివృద్ది కార్యక్రమాలు చేపట్టేందుకు ఆయన ప్రణాళిక సిద్ధం చేశారు.

First Published:  26 Jun 2024 9:19 AM GMT
Next Story