Telugu Global
Andhra Pradesh

అంగళ్లులో ఉద్రిక్తత.. పోలీసులపై చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు

రాళ్లదాడి చేస్తున్న వైసీపీ కార్యకర్తలను నియంత్రించడంలో పోలీసులు విఫలమయ్యారని మండిపడ్డారు చంద్రబాబు. వైసీపీ కార్యకర్తలు దాడులకు తెగబడితే పోలీసులు చోద్యం చూస్తున్నారని, డీఎస్పీ యూనిఫామ్‌ తీసేసి వైసీపీ కండువా కప్పుకోవాలన్నారు.

అంగళ్లులో ఉద్రిక్తత.. పోలీసులపై చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు
X

'ప్రాజెక్ట్ ల విధ్వంసంపై యుద్ధభేరి' పేరుతో సాగుతున్న చంద్రబాబు పర్యటన రాయలసీమలో ఉద్రిక్తతలకు కారణం అవుతోంది. పులివెందులలో వైసీపీ, టీడీపీ నేతల మధ్య సవాళ్లు మొదలయ్యాయి. అన్నమయ్య జిల్లాకు వచ్చే సరికి ఈ వ్యవహారం రాళ్లదాడి వరకు వెళ్లింది. అన్నమయ్య జిల్లా కురబలకోట మండలం అంగళ్లులో వైసీపీ, టీడీపీ శ్రేణులు పరస్పరం రాళ్లు రువ్వుకున్నాయి. పోలీసులు సర్దుబాటు చేసే లోపు కొంతమందికి గాయాలయ్యాయి. వైసీపీ వాళ్లే దాడి చేశారంటూ టీడీపీ ఆరోపిస్తుండగా, కావాలనే టీడీపీ నేతలు తమ కార్యకర్తలపై దాడి చేశారంటూ వైసీపీ ప్రత్యారోపణలు చేస్తోంది. ఈ దాడుల వ్యవహారం ఏపీలో పొలిటికల్ హీట్ ని మరింత పెంచింది.


ఏపీలో రేపోమాపో ఎన్నికలు జరుగుతాయేమో అనేలా ఉంది వ్యవహారం. అందులోనూ టీడీపీ యాక్టివిటీ బాగా పెరిగింది. ఓవైపు లోకేష్ యాత్ర, మరోవైపు చంద్రబాబు ప్రాజెక్ట్ ల యాత్రతో నిత్యం జనాల్లో ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే చంద్రబాబు రాయలసీమ పర్యటన మాత్రం రోజురోజుకీ ఉద్రిక్తతలకు కారణం అవుతోంది. అంగళ్లులో చంద్రబాబుకి ఆహ్వానం పలుకుతూ టీడీపీ ఫ్లెక్సీలు కట్టింది. వాటిని వైసీపీ నాయకులు తొలగించారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. మరోవైపు చంద్రబాబు రాకను అడ్డుకునేందుకు పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు రోడ్లపైకి వచ్చాయి. చంద్రబాబు వచ్చేలోగానే ఇరు వర్గాలు గొడవపడి సీన్ క్రియేట్ చేశాయి. పోలీసుల లాఠీచార్జితో పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఈ గొడవల్లో రెండు పోలీస్ వాహనాలకు నిప్పు పెట్టారు ఆందోళనకారులు.

పోలీసులపై చంద్రబాబు ఆగ్రహం..

రాళ్లదాడి చేస్తున్న వైసీపీ కార్యకర్తలను నియంత్రించడంలో పోలీసులు విఫలమయ్యారని మండిపడ్డారు చంద్రబాబు. గాయపడిన టీడీపీ నేతల్ని ఆయన పరామర్శించారు. వైసీపీ కార్యకర్తలు దాడులకు తెగబడితే పోలీసులు చోద్యం చూస్తున్నారని, డీఎస్పీ యూనిఫామ్‌ తీసేసి వైసీపీ కండువా కప్పుకోవాలన్నారు. బాంబులకే భయపడని తాను, రాళ్ల దాడికి భయపడతానా.. అని ప్రశ్నించారు చంద్రబాబు. తాను కూడా చిత్తూరు జిల్లాలోనే పుట్టానని, తాము ఎవరి జోలికీ పోమని, తమ జోలికి వస్తే ఊరుకోబోమని అన్నారు. పుంగనూరు వెళ్లి, అక్కడి పుడింగి సంగతి తేలుస్తానన్నారు. అంగళ్లులో జరిగిన ఘటనలో పోలీసుల వైఫ్యలం ఉందని, బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకోవాలన్నారు చంద్రబాబు.

First Published:  4 Aug 2023 5:10 PM IST
Next Story