Telugu Global
Andhra Pradesh

పేరు మార్పు వ్యవహారంలో చంద్రబాబే టార్గెట్..

హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పు ఇప్పుడు చంద్రబాబుకి తిప్పలు తెచ్చేలా మారింది. గతంలో ఎన్టీఆర్ పై చెప్పులు వేయించిన ఎపిసోడ్, వెన్నుపోటుతో పార్టీని లాగేసుకున్న ఎపిసోడ్.. అన్నీ మరోసారి హైలెట్ అవుతున్నాయి.

పేరు మార్పు వ్యవహారంలో చంద్రబాబే టార్గెట్..
X

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పు వ్యవహారంలో చివరకు చంద్రబాబు టార్గెట్ అయ్యేలా ఉన్నారు. అసెంబ్లీలో జరిగిన చర్చ, ఆ తర్వాత జరుగుతున్న ఆరోపణలు, ప్రత్యారోపణల్లో చంద్రబాబు వెన్నుపోటు ఎపిసోడ్ హైలెట్ అవుతోంది. ఎన్టీఆర్ పై అంత ప్రేమ ఉంటే ఆయనకు వెన్నుపోటు ఎందుకు పొడిచారని, పార్టీని ఎందుకు లాగేసుకున్నారని, చెప్పులు ఎందుకు వేయించారని ప్రశ్నిస్తున్నారు వైసీపీ నేతలు. ఇప్పుడు గింజుకుంటున్నవారంతా, అప్పుడు ఎన్టీఆర్‌ని శత్రువుగానే చూశారని అంటున్నారు.

కనీసం జిల్లాకయినా పేరు పెట్టారా..?

ఎన్టీఆర్ పేరుని ఎందుకు తొలగించారనే ప్రశ్నకు సమాధానం చెప్పే క్రమంలో టీడీపీపై ఎదురుదాడికి దిగింది వైసీపీ. చంద్రబాబు హయాంలో ఎన్టీఆర్‌ని అవమానించారని, ఇప్పుడు ఆయన పేరు గురించి మాట్లాడే అర్హత టీడీపీకి లేదంటున్నారు వైసీపీ నేతలు. ఎన్టీఆర్ పేరు జిల్లాకు పెట్టిన ఘనత తమదేనని లాజిక్ తీస్తున్నారు. జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడతామంటూ పాదయాత్రలో ఇచ్చిన హామీని జగన్ నిలబెట్టుకున్నారని చెప్పారు మంత్రి జోగి రమేష్. ఎన్టీఆర్‌పై నిజమైన ప్రేమ ఉన్న వ్యక్తి జగన్ మాత్రమేనన్నారు. నిమ్మకూరులో ఎన్టీఆర్ కాంస్య విగ్రహం పెట్టాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. గెలిచినప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబుకు ఎన్టీఆర్ ఎందుకు గుర్తుకురాలేదని ప్రశ్నించారు. కేంద్రంతో అంటకాగినపుడు ఎన్టీఆర్‌కు భారతరత్న అడగాలనే విషయం చంద్రబాబుకు గుర్తురాదని మండిపడ్డారు.

ఆరోగ్యశ్రీ ఎవరి ఆలోచన..?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వైద్యం అభివృద్ధికి పెద్ద పీట వేసిన వ్యక్తి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని చెప్పారు మంత్రి జోగి రమేష్. ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టడంతోపాటు, 108,104 అందుబాటులోకి తెచ్చారని గుర్తు చేశారు. లక్షల మంది పేదలను ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దిన ఒకే ఒక్క వ్యక్తి వైఎస్ఆర్ అని చెప్పారు. పేదలకు సేవ చేశాడు కాబట్టే హెల్త్ యూనివర్శిటీకి వైఎస్ఆర్ పేరు పెట్టాలని బిల్లు తీసుకొచ్చామన్నారు. చంద్రబాబు సమయంలో ప్రజలకు ఉపయోగపడే పథకాలు ఏం ప్రవేశపెట్టారో లోకేష్ చెప్పాలని సవాల్ విసిరారు మంత్రి జోగి రమేష్. మొత్తమ్మీద హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పు ఇప్పుడు చంద్రబాబుకి తిప్పలు తెచ్చేలా మారింది. గతంలో ఎన్టీఆర్‌పై చెప్పులు వేయించిన ఎపిసోడ్, వెన్నుపోటుతో పార్టీని లాగేసుకున్న ఎపిసోడ్.. అన్నీ మరోసారి హైలెట్ అవుతున్నాయి.

First Published:  21 Sept 2022 11:57 AM IST
Next Story