ప్రమాణ స్వీకార ఘట్టం పూర్తి.. ఈసారి స్పెషల్ ఏంటంటే..?
2014లో చంద్రబాబు సీఎంగా బాధ్యతలు చేపట్టిన సందర్భంలో నందమూరి ఫ్యామిలీ హీరోలంతా ప్రమాణ స్వీకారానికి తరలి వచ్చారు. ఈసారి మెగా ఫ్యామిలీ ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం పూర్తయింది. ఆయన తర్వాత పవన్ కల్యాణ్, లోకేష్.. మొత్తం 24మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం ఇది నాలుగోసారి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు రెండుసార్లు సీఎంగా పనిచేసిన ఆయన, విభజన తర్వాత ఏపీకి తొలి ముఖ్యమంత్రి అయ్యారు. ఐదేళ్లు ప్రతిపక్షంలో ఉండి ఇప్పుడు మళ్లీ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు.
చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవాన్ని అట్టహాసంగా నిర్వహించారు. కృష్ణా జిల్లా కేసరపల్లిలో సభా ప్రాంగణం ఏర్పాటు చేశారు. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా, జేపీ నడ్డా, నితిన్ గడ్కరీ సహా పలువురు బీజేపీ సీనియర్ నేతలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. తెలుగు రాష్ట్రాలనుంచి కేంద్ర మంత్రులుగా బాధ్యతలు చేపట్టిన రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, బండి సంజయ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
సినీరంగ ప్రముఖులు..
2014లో చంద్రబాబు సీఎంగా బాధ్యతలు చేపట్టిన సందర్భంలో నందమూరి ఫ్యామిలీ హీరోలంతా ప్రమాణ స్వీకారానికి తరలి వచ్చారు. ఈసారి మెగా ఫ్యామిలీ ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. చిరంజీవి, రజినీకాంత్ దంపతులతోపాటు మెగా ఫ్యామిలీ హీరోలు, కుటుంబ సభ్యులంతా తరలి వచ్చారు. నందమూరి కుటుంబం నుంచి జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ మాత్రం మిస్ అయ్యారు. మిగతా వారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్టేజ్ పై ప్రముఖులను ఆహ్వానిస్తూ బాలకృష్ణ సందడి చేశారు.
ప్రస్తుతానికి పవన్ కల్యాణ్ కేవలం మంత్రిగానే ప్రమాణ స్వీకారం చేయడం విశేషం. ఎక్కడా డిప్యూటీ సీఎం అనే పేరు ప్రస్తావనకు రాలేదు. అయితే చంద్రబాబు తర్వాత వెంటనే పవన్ కల్యాణ్, ఆ తర్వాత లోకేష్ పేర్లు పిలవడం విశేషం. గవర్నర్ అబ్దుల్ నజీర్ మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు. గతంలో ఎప్పుడూ లేనట్టుగా ఈసారి సీఎం ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాలకు విద్యుత్ దీపాలతో డెకరేషన్ చేశారు. చాలా చోట్ల ఎల్ఈడీ తెరలు ఏర్పాటు చేసి ప్రమాణ స్వీకార ఘట్టాన్ని ప్రత్యక్ష ప్రసారం చేశారు.