టీడీపీ నుంచి ఆ నేతలను సస్పెండ్ చేసిన చంద్రబాబు
చంద్రబాబు బుజ్జగించినప్పటికీ పలువురు నాయకులు మాత్రం తమ నామినేషన్లను ఉపసంహరించుకోలేదు. అలాంటి వారిపై చంద్రబాబు చర్యలకు దిగారు.
ఎన్నికల సమయంలో ప్రధాన పార్టీల నుంచి టికెట్లు కోరుకునే ఆశావహుల జాబితా భారీగానే ఉంటుంది. టికెట్లు దొరకని వారు రెబల్ గా పోటీ చేస్తుంటారు. ఈసారి ఏపీలో టీడీపీకి రెబల్స్ బెడద పెద్ద తలనొప్పిగా మారింది. ఏదో ఒక విధంగా న్యాయం చేస్తామని చంద్రబాబు బుజ్జగించినప్పటికీ పలువురు నాయకులు మాత్రం తమ నామినేషన్లను ఉపసంహరించుకోలేదు. అలాంటి వారిపై చంద్రబాబు చర్యలకు దిగారు. ఆరుగురు రెబల్ అభ్యర్థులను టీడీపీ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
ఈసారి టీడీపీ జనసేన, బీజేపీతో కలిసి కూటమిగా ఏర్పడి ఎన్నికల్లో పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. పొత్తులో భాగంగా పలు స్థానాలను టీడీపీ, జనసేన, బీజేపీలకు కేటాయించడంతో ఆ స్థానాల్లో మొదటినుంచి టీడీపీ బలోపేతం కోసం పనిచేసిన నాయకులు పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించి రెబల్ అభ్యర్థులుగా నామినేషన్ దాఖలు చేశారు. అటువంటి నాయకులతో చంద్రబాబు చర్చలు జరపగా.. పలువురు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. ఆరుగురు రెబల్స్ మాత్రం నామినేషన్లను ఉపసంహరించుకోలేదు. ఆ అభ్యర్థులను తాజాగా టీడీపీ నుంచి సస్పెండ్ చేస్తూ చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు.
సివేరి అబ్రహం (అరకు నియోజకవర్గం), మీసాల గీత (విజయనగరం నియోజకవర్గం), పరమట శ్యాంసుందర్(అమలాపురం నియోజకవర్గం), ముడియం సూర్యచంద్రరావు(పోలవరం నియోజకవర్గం), వేటుకూరి వెంకట శివరామరాజు (ఉండి నియోజకవర్గం), జడ్డా రాజశేఖర్ (సత్యవేడు నియోజకవర్గం)ను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు.