Telugu Global
Andhra Pradesh

చంద్రబాబు ఎదురుదాడి మొదలెట్టారా?

తనపైన జరిగిన హత్యాయత్నంపై కేసు నమోదు చేయాల్సిన పోలీసులు రివర్సులో తనపైనే హత్యాయత్నం కేసు పెట్టడం ఏమిటంటు మండిపోయారు.

చంద్రబాబు ఎదురుదాడి మొదలెట్టారా?
X

40 ఇయర్స్ ఇండస్ట్రీది మొదటి నుండి ఇదే పద్ధ‌తి. తప్పు చేసినా సాధ్యమైనంతవరకు దొరక్కుండా జాగ్రత్తలు తీసుకుంటారు. ఖర్మ కొద్ది దొరికిపోతే వెంటనే ఎదురుదాడి మొదలుపెట్టేస్తారు. ఎలాగూ ఎల్లో మీడియా బలముంది కాబట్టి తన వెర్షనే జనాల్లోకి ఎక్కువగా వెళుతుంది. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే పుంగనూరులో ఈనెల 3న అల్లర్లు జరిగిన విషయం తెలిసిందే. కేవలం చంద్రబాబు కారణంగానే అల్లర్లు జరిగాయి. ఆ అల్లర్లలో 20 మంది పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయి.

జరిగిన అల్లర్లకు, పోలీసుల గాయాలకు, పోలీసు వాహనాలకు నిప్పుపెట్టినందుకు చంద్రబాబే బాధ్యుడని, చంద్రబాబు చేసిన కుట్రలో భాగమేనని పోలీసులు ఏ1గా కేసు నమోదు చేశారు. పుంగనూరు బైపాస్ రోడ్డు మీదుగా చిత్తూరుకు వెళ్ళిపోవాల్సిన చంద్రబాబు సడెన్‌గా పుంగనూరు టౌన్లోకి ఎంటరవ్వటం అల్లర్లు చేయటానికే అని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. అందుకనే చంద్రబాబు మీద కుట్ర కేసు నమోదు చేశారు. ఎప్పుడైతే తనపైన పోలీసులు అల్లర్లకు సంబంధించి కుట్ర కేసు నమోదు చేశారని తెలిసిందో వెంటనే ఎదురుదాడి మొదలుపెట్టారు.

తనపైన చాలాసార్లు హత్యాయత్నాలు జరిగాయట. తనపైన జరిగిన హత్యాయత్నంపై కేసు నమోదు చేయాల్సిన పోలీసులు రివర్సులో తనపైనే హత్యాయత్నం కేసు పెట్టడం ఏమిటంటు మండిపోయారు. ఏపీ పోలీసుల విచారణ నుండి బయటపడటం కష్టమని అర్థ‌మైపోయి పదేపదే సీబీఐ విచారణ జరగాలని డిమాండ్ చేస్తున్నారు. తనను హత్య చేయటానికే వైసీపీ గూండాలు అంగళ్ళు ప్రాంతానికి వచ్చినట్లు చెప్పారు. గూండాలు వచ్చారుసరే పోలీసులకు ఇచ్చిన రూట్ మ్యాప్ ప్రకారం చిత్తూరు వెళ్ళాల్సిన తాను పుంగనూరు పట్టణంలోకి ఎందుకు వచ్చారంటే సమాధానం చెప్పటంలేదు.

తనిష్టం వచ్చిన చోటకు తాను వెళతాననే అడ్డదిడ్డమైన వాదన వినిపిస్తున్నారు. తనను హత్య చేయటానికి వైసీపీ గుండాలు ప్రయత్నిస్తే కమెండోలే తన ప్రాణాలను కాపాడినట్లు చెప్పటమే విచిత్రంగా ఉంది. ఎందుకంటే తనపైన హత్యాయత్నం జరిగిందని చంద్రబాబు ఎప్పుడూ ఎక్కడా చెప్పలేదు. ఇప్పుడు కూడా చంద్రబాబు వెహికల్ దగ్గరకు ఎవరూ వెళ్ళలేదు. ఆ విషయం వీడియోల్లో స్పష్టంగా కనబడుతునే ఉంది. చంద్రబాబే మైకులో తన మద్దతుదారులను పోలీసులు, వైసీపీ వాళ్ళమీదకు రెచ్చగొట్టి పంపుతున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. వీడియోల సాక్ష్యంగా తాను ఎక్కడ దొరికిపోతానో అనే భయంతోనే చంద్రబాబు ఎదురుదాడి మొదలుపెట్టినట్లున్నారు. మరి చివరకు ఏమి జరుగుతుందో చూడాలి.

First Published:  10 Aug 2023 10:46 AM IST
Next Story