Telugu Global
Andhra Pradesh

బూతు శ్రీ, బూతు రత్న, బూతు సామ్రాట్..

గుడివాడ సిట్టింగ్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నానిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు చంద్రబాబు. అయితే ఆయన పేరు మాత్రం ప్రస్తావించలేదు.

బూతు శ్రీ, బూతు రత్న, బూతు సామ్రాట్..
X

ఏపీలో వైసీపీ టికెట్ల కేటాయింపులపై గుడివాడ సభలో సెటైర్లు పేల్చారు చంద్రబాబు. ఓ మోస్తరు బూతులు తిడితే వారికి బూతు శ్రీ బిరుదు ఇచ్చి అసెంబ్లీ టికెట్ ఇస్తారని, ఇంకాస్త ఎక్కువ తిడితే బూతు రత్న బిరుదుతోపాటు ఎంపీ టికెట్ ఇస్తారని, ఇంకా బాగా తిట్టే బూతు సామ్రాట్ లకు వైసీపీ మంత్రి పదవులిస్తుందని ఎద్దేవా చేశారు. పవన్ కల్యాణ్ ని తిట్టడం కోసమే ఓ నాయకుడికి మంత్రి పదవి ఇచ్చారన్ననారు. గుడివాడలో గంజాయి మొక్కల్ని ఏరిపారేస్తానంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు.


కొడాలి, అంబటిపై పరోక్ష వ్యాఖ్యలు..

గుడివాడ సిట్టింగ్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నానిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు చంద్రబాబు. అయితే ఆయన పేరు మాత్రం ప్రస్తావించలేదు. క్యాసినోలు ఆడిస్తున్నారని, ప్రజల జేబులు గుల్ల చేస్తున్నారని విమర్శించారు. కొందరు నాయకులు పెన్షన్ డబ్బులు కాజేసి సంక్రాంతి సంబరాల పేరుతో డ్యాన్స్ లు చేస్తున్నారని మంత్రి అంబటి రాంబాబుపై పరోక్ష విమర్శలు చేశారు. సీఎం జగన్‌ ఒక రాజకీయ వ్యాపారి అని, అధికారం అంటే ఆయన దృష్టిలో దోపిడీ అని అన్నారు చంద్రబాబు. టీడీపీ-జనసేన గెలుపు అన్ స్టాపబుల్ అని ధీమా వ్యక్తం చేశారు.

ఈరోజు ఎన్టీఆర్ వర్థంతి సందర్భంగా ఆయన స్వగ్రామం కృష్ణా జిల్లా నిమ్మకూరులో పర్యటించిన చంద్రబాబు.. ‘పూర్‌ టు రిచ్‌’ కాన్సెప్ట్‌ ఆవిష్కరించారు. ఆ పథకం లక్ష్యాలను వివరించారు. ఈ పథకంలో పైలెట్‌ ప్రాజెక్టు కింద నిమ్మకూరు, నారావారిపల్లె గ్రామాలను ఎంపిక చేసినట్టు చెప్పారు. సంపద సృష్టించి అది పేదలు అనుభవించేలా చేయడమే పేదరిక నిర్మూలన ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశమని అన్నారు చంద్రబాబు. ప్రభుత్వ, ప్రైవేటు, ప్రజల భాగస్వామ్యంతో అభివృద్ధి పనులు చేపట్టాలన్నారు. ఇది ఆరంభం మాత్రమేనని, అందరి ఆలోచనలు తీసుకుని ముందుకు సాగుతామని స్పష్టం చేశారు.

First Published:  18 Jan 2024 8:19 PM IST
Next Story