Telugu Global
Andhra Pradesh

నా కుప్పంలో వేలు పెడితే నీ పులివెందుల జోలికొస్తా..!!

చంద్రబాబు ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటున్నారు. పులివెందులపై ఫోకస్ పెట్టారు. పులివెందులలో ఏదో జరిగిపోతోందని, జగన్ బలం తగ్గిపోతోందని.. టీడీపీ అనుకూల మీడియా ద్వారా ప్రచారం చేస్తున్నారు.

నా కుప్పంలో వేలు పెడితే నీ పులివెందుల జోలికొస్తా..!!
X

కుప్పంలో రాజకీయ వాతావరణం చంద్రబాబుకి ఏమంత సానుకూలంగా లేదని ఇటీవల చాలా సందర్భాల్లో రుజువైంది. కుప్పం స్థానిక ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేయడం, ఆ తర్వాత చంద్రబాబు పర్యటనలో గందరగోళం నెలకొనడం, కుప్పం వెళ్లినప్పుడల్లా చంద్రబాబు ఎదుటే జై జూనియర్ అంటూ నినాదాలు వినిపించడం.. ఇవన్నీ చూసుకుంటే కుప్పంలో టీడీపీ బలం తగ్గుతున్నట్టే చెప్పుకోవాలి. అదే సమయంలో వైసీపీ కూడా కుప్పంపై ఫోకస్ పెట్టింది. ఈసారి కుప్పంలో వైసీపీ జెండా ఎగరాలని, భరత్ ని ఎమ్మెల్యేగా గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తానంటూ హామీ ఇచ్చి, అక్కడి బాధ్యతలన్నీ పెద్దిరెడ్డికి అప్పగించారు సీఎం జగన్. ఒకరకంగా కుప్పంని, పనిలో పనిగా చంద్రబాబుని కూడా టార్గెట్ చేశారు. ఇప్పుడు దీనికి చంద్రబాబు ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటున్నారు. పులివెందులపై ఫోకస్ పెట్టారు. పులివెందులలో ఏదో జరిగిపోతోందని, జగన్ బలం తగ్గిపోతోందని.. టీడీపీ అనుకూల మీడియా ద్వారా ప్రచారం చేస్తున్నారు.

పులివెందులపై టీడీపీ ఫోకస్..!

కుప్పంపై వైసీపీ ఫోకస్ పెడితే ఏదైనా అద్భుతం జరిగే అవకాశముంది కానీ, పులివెందులలో జగన్ ని టార్గెట్ చేయాలంటే మాత్రం కష్టమైన పనే అంటున్నారు. కానీ చంద్రబాబు మాత్రం జగన్ కి అంత సీన్ లేదంటున్నారు. జగన్ పాలనపై పులివెందుల నియోజకవర్గ ప్రజలు కూడా సంతోషంగా లేరని, ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగిపోతోందని అన్నారు. పులివెందుల నియోజకవర్గంపై ఆయన సమీక్ష కూడా నిర్వహించారు. అక్కడినుంచి వచ్చిన కార్యకర్తలు, నాయకులకు దిశానిర్దేశం చేశారు చంద్రబాబు.

వివేకా హత్య తర్వాత..

వైఎస్ వివేకానందరెడ్డి హత్య తర్వాత పులివెందులలో జగన్ కి చెడ్డపేరు వచ్చిందని అంటున్నారు చంద్రబాబు. హత్య కేసులో దోషుల్ని స్వయంగా జగనే కాపాడటం పులివెందుల వాసులకు మింగుడుపడటం లేదన్నారు. ఒక్క ఛాన్స్‌ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్‌ కు, ఇదే చివరి ఛాన్స్‌ అని ఎద్దేవా చేశారు. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ ప్రజలకు మరింత చేరువ కావాలన్నారు.

మొత్తమ్మీద జగన్ కుప్పంపై ఫోకస్ పెంచిన తర్వాత చంద్రబాబు పులివెందుల విషయంలో హడావిడి చేయడం మాత్రం విశేషం. పులివెందుల సమీక్షలపై వైసీపీ కూడా వ్యంగ్యంగా స్పందిస్తోంది. చంద్రబాబు ముందు కుప్పం సంగతి చూసుకోవాలని, ఈసారి కుప్పంలో బాబు గెలిస్తే విశేషమేనని అంటున్నారు.

First Published:  10 Nov 2022 8:19 AM IST
Next Story