Telugu Global
Andhra Pradesh

చంద్రబాబుకు దిక్కుతోచటం లేదా..?

తెలుగుదేశంపార్టీ వైఖరిపై చర్చ మొదలైంది. అవిశ్వాస తీర్మానాన్ని చంద్రబాబు నాయుడు వ్యతిరేకిస్తున్నారా..? సమర్థిస్తున్నారా.. అన్నది తేలాలి.

చంద్రబాబుకు దిక్కుతోచటం లేదా..?
X

చంద్రబాబునాయుడు వైఖరి చాలా విచిత్రంగా ఉంటుంది. తీసుకునే ప్రతి నిర్ణయంలోనూ తనకే లాభం ఉండాలని కోరుకుంటారు. అలా అనుకోవడంలో తప్పులేదు కానీ, అన్నీసార్లు సాధ్యంకాదన్న విషయాన్ని మరచిపోతారు. అందుకనే ఏ నిర్ణయమూ తీసుకోకుండా విపరీతమైన జాప్యం చేస్తారు. దానివల్ల మొదటికే మోసం వచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇప్పుడిదంతా ఎందుకంటే.. మణిపూర్‌లో అల్లర్లపై నరేంద్రమోడీ ప్రభుత్వంపై `ఇండియా` కూటమి ఇచ్చిన అవిశ్వాస తీర్మానం పార్లమెంటులో చర్చకు వస్తోంది.

చర్చ తర్వాత ఓటింగ్ జరుగుతుంది. ఓటింగ్ వల్ల ఎన్డీయే ప్రభుత్వానికి ఏమో అయిపోతుందని కాదు. కాకపోతే చర్చలు, ఓటింగ్ వల్ల రెండు అంశాల్లో క్లారిటీ వస్తుంది. మొదటిదేమో ఎన్డీయేకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ఎంత బలంగా ఉన్నాయన్నది తేలుతుంది. అలాగే మణిపూర్‌లో అల్లర్లను కంట్రోల్ చేయటంలో ప్రభుత్వ వైఫల్యం స్పష్టమవుతుంది. ఈ నేపథ్యంలోనే చర్చ, ఓటింగ్‌కు ఎంపీలందరూ పార్లమెంటుకు తప్పనిసరిగా హాజరవ్వాలని పార్టీలన్నీ విప్ జారీచేస్తున్నాయి. కాంగ్రెస్, ఆప్ పార్టీలు ఇప్పటికే విప్ ను జారీచేశాయి.

మరీ నేపథ్యంలో తెలుగుదేశంపార్టీ వైఖరిపై చర్చ మొదలైంది. అవిశ్వాస తీర్మానాన్ని చంద్రబాబు నాయుడు వ్యతిరేకిస్తున్నారా..? సమర్థిస్తున్నారా.. అన్నది తేలాలి. నిజానికి ఈ విషయమై చంద్రబాబు నిర్ణయం తీసుకునే ఉంటారు. కానీ, దాన్ని బయటకు ప్రకటించలేదు. ఇప్పుడు బహిరంగంగా ప్రకటించక తప్పని పరిస్థితి వచ్చింది. అయినా చంద్రబాబు నోరుమెదపకపోవటంతోనే తమ్ముళ్ళలో అసహనం పెరిగిపోతోంది. రాబోయే ఎన్నికల్లో బీజేపీతో కలిసి వెళ్ళాలనే కోరిక బలంగా ఉంటే అవిశ్వాసాన్ని వ్యతిరేకించాలి. బీజేపీతో పొత్తు వద్దనుకుంటే అవిశ్వాసానికి మద్దతివ్వాలి. ఈ రెండింటిలో ఏ నిర్ణయమూ తీసుకోకుండా మధ్యే మార్గంగా తటస్థ‌మన్నా, గైర్హాజరన్నా బీజేపీకి అనుకూలంగా ఉన్నారనే సంకేతాలు వెళ్లిపోతాయి.

మొదటినుండి చంద్రబాబుది ముసుగులో గుద్దులాట వ్యవహారమే. ఏ సంగతి ఓ పట్టాన తేల్చరు. అవిశ్వాస తీర్మానాన్ని వ్యతిరేకిస్తున్నట్లు వైసీపీ స్పష్టంగా ప్రకటించేసింది. మరిదే పద్దతిలో చంద్రబాబు కూడా ఎందుకు ప్రకటించలేకపోతున్నారని తమ్ముళ్ళు మాట్లాడుకుంటున్నారు. అవిశ్వాసానికి మద్దతిస్తే ఏమవుతుందో ? వ్యతిరేకిస్తే ఏమవుతుందో ? అన్న భయమే చంద్రబాబును వెంటాడుతోంది. ఎలాగూ చంద్రబాబును ఇటు ఎన్డీయే అటు `ఇండియా` కూటమి ఏదీ నమ్మటంలేదు. అయినా చంద్రబాబును ఏదో భయం వెంటాడుతుండటమే విచిత్రంగా ఉంది.

First Published:  27 July 2023 10:40 AM IST
Next Story