Telugu Global
Andhra Pradesh

ఏపీ కేబినెట్‌ కూర్పు.. సీనియర్లకు బాబు షాక్

ప్రధానంగా పార్టీలో అత్యంత సీనియర్‌గా పేరున్న గోరంట్ల బుచ్చయ్య చౌదరికి ఈసారి మంత్రిగా అవకాశం దక్కుతుందని అంతా భావించారు.

ఏపీ కేబినెట్‌ కూర్పు.. సీనియర్లకు బాబు షాక్
X

ఆంధ్రప్రదేశ్‌లో ఇవాళ కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. ముఖ్యమంత్రిగా చంద్రబాబుతో పాటు మరో 24 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. జనసేన నుంచి నలుగురికి, బీజేపీ నుంచి ఒకరికి మంత్రి పదవులు కేటాయించారు చంద్రబాబు. ఇక కేబినెట్‌లో దాదాపు 17 మంది కొత్త నేతలకు అవకాశం ఇచ్చిన చంద్రబాబు.. మంత్రి పదవులు ఆశించిన సీనియర్లకు షాకిచ్చారు.

ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ 135 స్థానాల్లో విజయం సాధించింది. దాదాపు పార్టీలోని సీనియర్లందరూ విజయం సాధించారు. దీంతో మంత్రి వర్గంలో ఈసారి సీనియర్లకు పెద్దపీట వేస్తారని అంతా భావించారు. కానీ అలా ఆశించిన నేతలకు భంగపాటు తప్పలేదు. అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, పొంగూరు నారాయణ, ఆనం రామనారాయణ రెడ్డి, కొలుసు పార్థసారథి మినహా సీనియర్లకు చోటు దక్కలేదు.

ప్రధానంగా పార్టీలో అత్యంత సీనియర్‌గా పేరున్న గోరంట్ల బుచ్చయ్య చౌదరికి ఈసారి మంత్రిగా అవకాశం దక్కుతుందని అంతా భావించారు. మొదటి నుంచి పార్టీలో ఉండడంతో పాటు ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బుచ్చయ్య చౌదరికి ఇప్పటివరకూ అమాత్య యోగం లభించలేదు. గతంలో చాలా సార్లు ఈ విషయంపై తన అసంతృప్తిని బయటపెట్టారు బుచ్చయ్య. కానీ, ఈసారి కూడా జాబితాలో ఆయన పేరు లేదు. ఇక ఉత్తరాంధ్రకు చెందిన చెందిన సీనియర్లు అయ్యన్న పాత్రుడు, గంటా శ్రీనివాస రావులకు సైతం మంత్రి పదవులు దక్కలేదు. చీపురుపల్లిలో బొత్స సత్యనారాయణపై గెలిచిన కిమిడి కళా వెంకట్రావును సైతం పరిగణలోకి తీసుకోలేదు చంద్రబాబు.

రాయలసీమ జిల్లాలకు చెందిన మాజీ మంత్రులు పరిటాల సునీత, కాలవ శ్రీనివాసులు, మాజీ కేంద్రమంత్రి కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి, మాజీ మంత్రి అఖిలప్రియ పేర్లు మంత్రి పదవుల రేసులో వినిపించినప్పటికీ.. జాబితాలో మాత్రం చోటు దక్కలేదు. జగన్ ప్రభుత్వంలో మంత్రి పదవి దక్కకపోవడంతో వైసీపీపై తిరుగుబాటు చేసి టీడీపీలో చేరిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి కూడా నిరాశే మిగిలింది. వీరితో పాటు బోండా ఉమా, కన్నా లక్ష్మినారాయణ, జి.వి.ఆంజనేయులు, దూళిపాళ్ల నరేంద్రలాంటి సీనియర్లకు అవకాశం దక్కలేదు.

First Published:  12 Jun 2024 9:08 AM IST
Next Story