ఎమ్మెల్యే భర్త అరెస్ట్.. చంద్రబాబు ఘాటు రియాక్షన్
ఆదిరెడ్డి కుటుంబ సభ్యుల అరెస్ట్ ని ప్రతిపక్షనేత చంద్రబాబు ఖండించారు. ప్రత్యర్థులను వేధించడం కోసమే ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతోందని మండిపడ్డారాయన.
రాజమండ్రిలో జగజ్జనని చిట్ ఫండ్స్ కంపెనీ డైరెక్టర్లుగా ఉన్న ఆదిరెడ్డి అప్పారావు, వాసుని సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. జగజ్జనని చిట్ ఫండ్ మోసాలపై సీఐడీకి, కాకినాడ అసిస్టెంట్ రిజిస్ట్రార్ కు ఫిర్యాదులందడంతో వారు దాడులు చేశారు. నకిలీ ఖాతాలు సృష్టించి మోసాలకు పాల్పడినట్టు, చిట్స్ చెల్లింపుల్లో కూడా అక్రమాలు జరిగినట్టు, ఖాతాదారుల డబ్బులను దుర్వినియోగం చేయడం, ఫాల్స్ డిక్లరేషన్ వంటి వ్యవహారాలతో కేసులు నమోదు చేశారు. మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని భర్త ఆదిరెడ్డి శ్రీనివాస్ ను అరెస్ట్ చేశారు సీఐడీ అధికారులు.
చంద్రబాబు ఆగ్రహం..
ఆదిరెడ్డి కుటుంబ సభ్యుల అరెస్ట్ ని ప్రతిపక్షనేత చంద్రబాబు ఖండించారు. ప్రత్యర్థులను వేధించడం కోసమే ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతోందని మండిపడ్డారాయన. రోజురోజుకీ వైసీపీ వేధింపులు పెరిగిపోతున్నాయన్నారు. కేసులు పెట్టి లొంగదీసుకోవాలనే ఆలోచనలు మానుకోవాలని హితవు పలికారు. సీఐడీ దర్యాప్తు సంస్థా.. లేక వైసీపీ వేధింపుల ఏజెన్సీనా? అని ప్రశ్నించారు. కోర్టులతో చీవాట్లు తిన్నా కూడా ఏపీ ప్రభుత్వానికి బుద్ధి రాలేదన్నారు. అసలు రాష్ట్రంలో ఎవరూ వ్యాపారం చేయకూడదా? అని ప్రశ్నించారు చంద్రబాబు.
టీడీపీ నేతలు ఆదిరెడ్డి ఆప్పారావు, ఆదిరెడ్డి శ్రీనివాస్ ల అరెస్టు ను ఖండిస్తున్నాను. వైసీపీ ప్రభుత్వ రాజకీయ వేధింపులు, కక్ష సాధింపులు పెరుగుతున్నాయే తప్ప...వారిలో మార్పు రావడం లేదు. ప్రత్యర్థులను ఓడించడానికి పాలనను నమ్ముకోవాల్సిన ప్రభుత్వం....అక్రమ కేసులను, అరెస్టులను మాత్రమే… pic.twitter.com/lZxzVhSBC6
— N Chandrababu Naidu (@ncbn) April 30, 2023
వైసీపీ కేడీలకు, సీఐడీ అధికారులకు తేడా లేకుండా పోయిందని విమర్శించారు మాజీ మంత్రులు అచ్చెన్నాయుడు, చిన రాజప్ప, నక్కా ఆనందబాబు. వైసీపీ నాయకులు టీడీపీ కార్యకర్తలపై భౌతిక దాడులకు పాల్పడుతుంటే, సీఐడీ అధికారులు సోదాల పేరుతో టీడీపీ నేతల ఇళ్లపై దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. ఆదిరెడ్డి కుటుంబం నీతి నిజాయితీ ఏంటో రాజమహేంద్రవరం ప్రజల్ని అడిగితే చెబుతారన్నారు.
ఈ ఏడాది మహానాడు కార్యక్రమాన్ని రాజమహేంద్రవరంలో నిర్వహించబోతున్నందున స్థానిక టీడీపీ నేతల్ని భయపెట్టాలనే కుట్రలో భాగంగానే ఈ అరెస్ట్ లు జరిగాయనే విమర్శలు వినపడుతున్నాయి. సీఎం జగన్ అభివృద్ధిని పక్కన పెట్టి ప్రతిపక్ష నేతల అరెస్టులతోనే ప్రభుత్వాన్ని నడుపుతున్నారని మండిపడ్డారు టీడీపీ నేతలు. చంద్రబాబు, లోకేష్ సభలకు వస్తున్న జనాల్ని చూసి ఓర్వలేకే రాజమహేంద్రవరంలో బలమైన నాయకులైన ఇద్దర్ని అక్రమంగా అరెస్టు చేసి వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.