Telugu Global
Andhra Pradesh

బహిష్కృత ఎంపీని బతిమిలాడుకుంటున్నారా..?

చంద్రబాబు తరపున కనకమేడల ఎంపీ కేశినేనిని కలిశారు. గంటన్నర సేపు భేటీ జరిగింది. తర్వాత రవీందర్ మీడియాతో మాట్లాడకుండానే వెళ్ళిపోయారు. కేశినేనిని చల్లబరచటానికే కనకమేడలను చంద్రబాబు దూతగా పంపినట్లు అర్థ‌మైపోయింది.

బహిష్కృత ఎంపీని బతిమిలాడుకుంటున్నారా..?
X

పార్టీలో ఎవరిమీద కూడా చర్యలు తీసుకునేంత ధైర్యం చంద్రబాబుకు లేదు. లేస్తే మనిషిని కాదని బెదిరిస్తూ నేతలను అదుపులో పెట్టుకోవటమే చంద్రబాబుకు తెలిసింది. అలాంటిది విజయవాడ ఎంపీ కేశినేని నానిని పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లుగా చెప్పటమే ఆశ్చర్యమనిపించింది. బహిష్కరణ వేటు కూడా డైరెక్టుగా ప్రకటించకుండా అడ్డదిడ్డమైన ప్రకటనతో మమ అనిపించారు. ఆ ప్రకటనను చదివినవాళ్ళు ఓహో ఎంపీని పార్టీ నుంచి చంద్రబాబు బహిష్కరించారు కాబోలు అని అనుకోవాలి.

జనాలందరూ అలా అనుకుంటుండగానే ఎంపీని బతిమలాడుకోవటాలు మొదలైపోయాయి. తన అవసరం లేదని చంద్రబాబు అనుకున్న తర్వాత తానిక పార్టీలో కంటిన్యూ అవటం బాగోదని ఎంపీ మీడియాతో చెప్పారు. రాజీనామా చేసేందుకు లోక్ సభ స్పీకర్ ఓంబిర్లా అపాయిట్మెంట్ కోరినట్లు చెప్పారు. స్పీకర్ నుంచి తనకు కబురు రాగానే వెంటనే వెళ్ళి రాజీనామా చేస్తానని ప్రకటించారు. రాజీనామా చేసిన తర్వాత తాను అన్నీ విషయాలు మాట్లాడుతానని చెప్పారు. దీంతోనే చంద్రబాబు అండ్ కో లో వ‌ణుకు మొదలైనట్లుంది. అందుకనే అర్జంటుగా రాజ్యసభ ఎంపీ కనకమేడల రవీంద్రను చంద్రబాబు రంగంలోకి దింపారు.

చంద్రబాబు తరపున కనకమేడల ఎంపీ కేశినేనిని కలిశారు. గంటన్నర సేపు భేటీ జరిగింది. తర్వాత రవీందర్ మీడియాతో మాట్లాడకుండానే వెళ్ళిపోయారు. కేశినేనిని చల్లబరచటానికే కనకమేడలను చంద్రబాబు దూతగా పంపినట్లు అర్థ‌మైపోయింది. ముందు బహిష్కరిస్తున్నట్లు చెప్పి ఇప్పుడు బతిమలాడుకోవటం చంద్రబాబుకే చెల్లింది. తాజా ఘటనతో చంద్రబాబు ఎంతటి పిరికి వ్యక్తో అందరికీ తెలిసొచ్చింది. ఒక్క ఎంపీ మీద గట్టిగా చర్యలు తీసుకోలేక తల్లకిందులవుతున్నారు.

వైసీపీలోని చిన్న విషయాలను కూడా బూతద్దంలో చూపించి పదేపదే ప్రచారం చేసి ఏదో జరిగిపోతోందని, జగన్మోహన్ రెడ్డి పనైపోయిందని ఎల్లోమీడియాలో రాయించుకుంటున్నారు. అదే తన పార్టీలో పడిన బొక్కను పూడ్చుకోలేక నానా అవస్థ‌లు పడుతున్నారు. ఎంపీ ఎపిసోడ్ ను ఎల్లోమీడియా ప్రముఖంగా కవర్ చేయటంలేదు. రేపు ఎంపీ పూర్తిగా అడ్డంతిరిగితే అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో టీడీపీ+జనసేన గెలుపు కష్టమని చంద్రబాబు భయపడుతున్నారు. అందుకనే ఎంపీకి ఆగ్రహం రాకుండా బతిమలాడుకుంటున్నారు. మరి ఈ బహిష్క‌రణ ఎపిసోడ్ ఏమవుతుందో చూడాలి.

First Published:  7 Jan 2024 12:16 PM IST
Next Story