నాకు ఇవే చివరి ఎన్నికలు.. ప్లీజ్ గెలిపించండి
ఏపీ ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ధ్వజమెత్తారు చంద్రబాబు. సంక్షేమ పథకాల పేరుతో జగన్, ప్రజలకు ఇచ్చేది గోరంత, ఆ తర్వాత పన్నులు, ఇతరత్రా వడ్డింపులతో దోచేది కొండంత అని వ్యంగ్యాస్త్రాలు విసిరారు.
కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్న చంద్రబాబు.. సైకిల్ గాలి వీస్తోందని తమ్ముళ్లకు భరోసా ఇస్తూనే మరోవైపు తనకివే చివరి ఎన్నికలంటూ సింపతీ క్రియేట్ చేసే పనిలో ఉన్నారు. ఇప్పటికే జగన్ వల్ల రాష్ట్రంలో పాలన అస్తవ్యస్తంగా మారిందని, దాన్ని సరిదిద్దే అవకాశం తనకివ్వాలన్నారు. 'మీరు గెలిపిస్తే సరే సరి, లేదంటే నాకివే చివరి ఎన్నిక 'లంటూ ప్రాధేయపడ్డారు.
పాతపాటే..
అసెంబ్లీలో తనను అవమానించారని, తన భార్యను కూడా అవమానించారని పత్తికొండ రోడ్ షో లో ఆవేదన వ్యక్తం చేశారు చంద్రబాబు. ఏపీలో ఇప్పుడున్నది కౌరవ సభ అని, తనకు అవకాశమిస్తే దాన్ని గౌరవ సభగా మార్చేస్తానన్నారు. 2003లో 23 మందు పాతరలతో తనపై దాడి చేస్తే వేంకటేశ్వరస్వామి కాపాడారని గుర్తుచేసుకున్నారు. రాష్ట్రంలో అరాచక శక్తుల్ని తుదముట్టించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. పోలీస్ శాఖలో కొందరి వల్ల అందరికీ చెడ్డపేరు వస్తుందని.. తప్పులు చేస్తే రాబోయే రోజుల్లో వైఎస్ జగన్ కాపాడలేరని హెచ్చరించారు.
ఆయన ఇచ్చేది గోరంత, దోచేది కొండంత..
ఏపీ ప్రభుత్వ సంక్షేమ పథకాలపై కూడా ధ్వజమెత్తారు చంద్రబాబు. ఏపీ ప్రభుత్వం సంక్షేమ పథకాల పేరుతో ప్రజలకు ఇచ్చేది గోరంత, ఆ తర్వాత పన్నులు, ఇతరత్రా వడ్డింపులతో దోచేది కొండంత అని వ్యంగ్యాస్త్రాలు విసిరారు. నవ్యాంధ్రప్రదేశ్ ని 2029 నాటికి దేశంలో అగ్రస్థానంలో నిలపాలనకున్నానని, కానీ వైఎస్ జగన్ ఒక్క ఛాన్న్ అన్న మాటకు ప్రజలు మోసపోయారని చెప్పారు. ఈ సారి టీడీపీకే ఓటు వేయాలని పిలుపునిచ్చారు.
మోదీ నన్ను పొగిడారు.
విశాఖకు మోదీ వచ్చినప్పుడు డ్వాక్రా సంఘాల గురించి గుర్తు చేశారని, చంద్రబాబు ప్రవేశ పెట్టిన డ్వాక్రా సంఘాలు దేశానికే ఆదర్శం అని బీజేపీ నేతలతో చెప్పారని అన్నారు. ఇక ఇప్పటంలో పవన్ కల్యాణ్ సభకు భూములిచ్చినవారిపై కక్ష సాధింపు చర్యలకు దిగడం సరికాదని ఏపీ ప్రభుత్వానికి హితవు పలికారు. తనపై కోడిగుడ్లు, రాళ్లు వేస్తే భయపడి పారిపోబోనని చెప్పారు.