హోదా పేరెత్తే అర్హత చంద్రబాబుకి ఉందా..?
హోదా విషయంలో గతంలో చంద్రబాబు ఆడిన డ్రామాలు కూడా అందరికీ గుర్తున్నాయి. హోదా గురించి మాట్లాడిన ప్రతిసారీ చంద్రబాబు సెల్ఫ్ గోల్ వేసుకున్నట్టే లెక్క.
ప్రత్యేక హోదా విషయంలో సీఎం జగన్ ఫెయిలయ్యారని, కేంద్రం మెడలు వంచుతానన్న ఆయన ఇన్నాళ్లూ ఏం చేశారని ఎద్దేవా చేశారు చంద్రబాబు. ఢిల్లీ వెళ్తే జగన్ పిల్లిలాగా మారిపోతారని కూడా విమర్శించారు. అసలు హోదా విషయంలో చంద్రబాబుకి మాట్లాడే అర్హతే లేదంటున్నారు నెటిజన్లు. తాను అధికారంలో ఉన్నప్పుడు హోదా వద్దు ప్యాకేజీ ముద్దని, ఆ తర్వాత ప్యాకేజీ వద్దు హోదాయే కావాలంటో నాలుక మడతేసిన వ్యక్తి చంద్రబాబు. అధికారం పోయాక ఆ నెపం వైసీపీపైకి నెట్టి ఇప్పుడు మళ్లీ బీజేపీతో అంటకాగుతున్నారు. అలాంటి చంద్రబాబుకి అసలు హోదా పేరెత్తే అర్హతే లేదంటున్నారు నెటిజన్లు.
ఎవరు పిల్లి..?
ఢిల్లీ వెళ్లిన జగన్ ప్రత్యేక హోదాపై పలుమార్లు కేంద్రంలోని పెద్దలకు వినతిపత్రాలు అందించారు. వైసీపీ ఎంపీలు అవకాశం వచ్చినప్పుడల్లా పార్లమెంట్ లో ప్రత్యేక హదా అంశాన్ని ప్రస్తావించారు. హోదాకోసం వైసీపీ చేసిన ప్రయత్నాన్ని ఎవరూ శంకించాల్సిన పనిలేదు. అయితే హోదా విషయంలో గతంలో చంద్రబాబు ఆడిన డ్రామాలు కూడా అందరికీ గుర్తున్నాయి. హోదాకోసమే ఎన్డీఏ నుంచి బయటకొచ్చామని చెప్పుకున్న చంద్రబాబు, మళ్లీ అదే పార్టీతో ఎందుకు పొత్తు పెట్టుకున్నారో చెప్పాల్సిన అవసరం ఉంది. పొత్తుకోసం పదే పదే ఢిల్లీ వెళ్లి, అపాయింట్ మెంట్ లు దొరక్కపోతే అమిత్ షా వాకిట్లో వేచి చూసిందెవరో చంద్రబాబే చెప్పాలి. పొత్తుకోసం బీజేపీ నేతల కాళ్లావేళ్లా పడిన చంద్రబాబు.. ఇప్పుడు జగన్ ని పిల్లి అంటూ వెటకారం చేయాలుకోవడం విచిత్రం.
హోదా గురించి మాట్లాడిన ప్రతిసారీ చంద్రబాబు సెల్ఫ్ గోల్ వేసుకున్నట్టే లెక్క. హోదా కోసం నువ్వెందుకు ప్రశ్నించవు అంటూ జగన్ ని అడుగుతున్న చంద్రబాబు, కూటమిలో ఉన్నా కూడా తానెందుకు ఆ విషయంలో చొరవ చూపించలేదే ప్రజలకు చెప్పాలి. ఆ మాట చెప్పలేకపోతే జగన్ ని వేలెత్తి చూపించే అర్హత చంద్రబాబుకి లేదని అనుకోవాలి.