తక్కువ ధరకే నాణ్యమైన మద్యం.. బాబు సెల్ఫ్ గోల్
చంద్రబాబు సెల్ఫ్ గోల్ వేసుకున్నారు. మందుబాబులను ఆకట్టుకునే క్రమంలో మహిళల పాలిట విలన్ లా మారుతున్నారు.
తక్కువ ధరకే నాణ్యమైన వైద్యం..
నాణ్యమైన విద్య..
తక్కువ ధరకే నిత్యావసరాలు..
రాజకీయ నాయకుల హామీలు సహజంగా ఇలానే ఉంటాయి. కానీ ఏపీలో చంద్రబాబు మాత్రం తన ఓటమిని తానే ఖాయం చేసుకున్నారు. తక్కువ ధరకే నాణ్యమైన మద్యం సరఫరా చేస్తానంటూ హామీ ఇస్తున్న బాబు మహిళలకు పరోక్షంగా శత్రువులా కనపడుతున్నారు.
గత ఎన్నికల్లో సంపూర్ణ మద్యపాన నిషేధం అంటూ జగన్ హామీ ఇచ్చారు. ఆ హామీ పూర్తి స్థాయిలో నెరవేరేలా కనపడలేదు. దీంతో ఆయన మద్యపాన నియంత్రణకు సిన్సియర్ గా ప్రయత్నిస్తున్నారు. బెల్ట్ షాపులు రద్దు చేసి, మద్యం సరఫరా తగ్గించారు. అదే సమయంలో రేట్లు పెంచి మద్యం ప్రియులు దానికి దూరమయ్యేలా చేశారు. అయితే సరిగ్గా ఇక్కడే చంద్రబాబు సెల్ఫ్ గోల్ వేసుకున్నారు. జగన్ మద్యం రేట్లు పెంచారని, తాను ఆ రేట్లు తగ్గిస్తానని హామీ ఇస్తున్నారు. నాణ్యమైన మద్యం అందుబాటులో లేదని, తాను అధికారంలోకి వస్తే ఆ పని చేస్తానని అంటున్నారు బాబు. అంటే జగన్ చేయలేని పని తాను చేస్తానని చెప్పుకునే క్రమంలో.. సమాజానికి చెడు చేయడానికి తాను రెడీ అనే సంకేతాలు పంపుతున్నారు బాబు.
మద్యపాన నిషేధాన్ని జగన్ అమలు చేయలేదు అని నిందలు వేయాలనుకుంటున్నారు చంద్రబాబు. పోనీ అలా జగన్ ని టార్గెట్ చేయాలనుకుంటే మద్యపాన నిషేధం తాను అమలు చేసి చూపిస్తానని బాబు హామీ ఇవ్వాలి. కానీ అలా హామీ ఇచ్చే ధైర్యం ఆయనకు లేదు. అందుకే నాణ్యమైన మద్యం, తక్కువ ధరలు అంటూ ఊరిస్తున్నారు. సరిగ్గా ఇక్కడే బాబు సెల్ఫ్ గోల్ వేసుకున్నారు. మందుబాబులను ఆకట్టుకునే క్రమంలో మహిళల పాలిట విలన్ లా మారుతున్నారు చంద్రబాబు.
జగన్ కూడా ఈ విషయంలో చంద్రబాబుని టార్గెట్ చేశారు. తక్కువ ధరకే నాణ్యమైన విద్య, వైద్యం.. అందుబాటులోకి తెస్తానని చెప్పకుండా తక్కువ ధరకు మద్యం అంటున్నారని చంద్రబాబుని ఎద్దేవా చేశారు.