జగన్ మీద చంద్రబాబు నోట అదే తప్పుడు మాట..
అప్పులు చేసి చంద్రబాబు ఏం చేశారు? ప్రజల కోసం ఏ పథకాలు అమలు చేశారు? రాష్ట్ర ప్రగతి ఏ మేరకు జరిగింది? అనే ప్రశ్నలు వేసుకుని జవాబులు వెతకాల్సిన అవసరం ఉంది. జగన్ అమలు చేస్తున్న పథకాల్లో పావలా వంతైనా చంద్రబాబు చేశారా?
అప్పులు తెచ్చి బటన్ నొక్కడం గొప్ప కాదని టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. శ్రీకాకుళంలో మహిళలతో ముఖాముఖి కార్యక్రమంలో ఆయన బుధవారం ఈ మాట అన్నారు. బటన్ నొక్కడం వల్ల పథకాల సొమ్ము నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి వెళ్తుంది. ఇందులో లంచాలకు తావు లేదు. వైఎస్ జగన్ అప్పులు చేసి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారనే వక్రీకరణకు చంద్రబాబు దిగిపోయారు. ఎల్లో మీడియా కూడా అదే పాట పాడుతోంది. ఏపీ అప్పులపై అబద్ధాలు చెప్పుతోంది. ఏపీ అప్పులు 10 లక్షల కోట్ల రూపాయలు అని చంద్రబాబు, ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం సాగిస్తోంది.
రాష్ట్ర విభజన సమయంలో ఏపీ అప్పులు రూ.97 వేల కోట్లు ఉన్నాయి. చంద్రబాబు దిగిపోయేనాటికి అవి 2.64 లక్షల కోట్ల రూపాయలకు చేరుకున్నాయి. వీటికి అదనంగా చంద్రబాబు వివిధ కార్పొరేషన్ల ద్వారా లక్షల కోట్ల అప్పుతో పాటు, విత్తనాలు, ధాన్యం కొనుగోలు, డిస్కంలకు చెల్లించాల్సిన బిల్లులను భారీగా పెండింగ్‌లో పెట్టి వెళ్లాడు. జగన్ అధికారం చేపట్టేనాటికి ఏపీ అప్పులు రూ.2.64 లక్షల కోట్లు ఉన్నాయి. ప్రస్తుతం అవి రూ.4.42 లక్షల కోట్లు ఉన్నాయి. అంటే నాలుగేళ్లలో జగన్ చేసిన అప్పులు రూ.1.77 లక్షల కోట్లు. చంద్రబాబు చేసిన అప్పులతో పోల్చుకుంటే జగన్ చేసిన అప్పులు తక్కువ.
అప్పులు చేసి చంద్రబాబు ఏం చేశారు? ప్రజల కోసం ఏ పథకాలు అమలు చేశారు? రాష్ట్ర ప్రగతి ఏ మేరకు జరిగింది? అనే ప్రశ్నలు వేసుకుని జవాబులు వెతకాల్సిన అవసరం ఉంది. జగన్ అమలు చేస్తున్న పథకాల్లో పావలా వంతైనా చంద్రబాబు చేశారా? 2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీలను చంద్రబాబు 12 శాతం కూడా అమలు చేయలేదు. మేనిఫెస్టోలో పెట్టిన పలు హామీలను ఆయన అసలు పట్టించుకోలేదు. వైఎస్ జగన్ తాను ఇచ్చిన హామీల్లో 99 శాతం అమలు చేశారు. ఏ ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు చేపట్టని పథకాలను జగన్ చేపట్టారు. సంక్షేమ పథకాలతో పాటు చంద్రబాబు పెట్టివెళ్లిన బకాయిలను జగన్ ప్రభుత్వం ఒక్కొక్కటిగా క్లియర్ చేసింది.
నిరుపేదలకు విద్యను, వైద్యాన్ని అందించడానికి జగన్ వినూత్నమైన పథకాలను అమలులోకి తెచ్చారు. నాడు - నేడు కార్యక్రమం ద్వారా ఏపీ దిశ, దశనూ మార్చేశారు. రాష్ట్రంలోని ప్రధాన రంగాలకు జగన్ కేటాయింపులు పెంచారు. వ్యవసాయానికి చంద్రబాబు రూ. 34,125 కోట్లు కేటాయిస్తే, జగన్ రూ.81,215 కోట్లు కేటాయించారు. గ్రామీణాభివృద్ధికి చంద్రబాబు రూ.46,897 కోట్లు కేటాయిస్తే, జగన్ రూ.92,655 కోట్లు కేటాయించారు. జలవనరులకు చంద్రబాబు రూ.29,546 కోట్లు కేటాయిస్తే, జగన్ రూ.62,540 కోట్లు కేటాయించారు. ప్రతిరంగంలోనూ చంద్రబాబు కంటే రెండింతలు ఖర్చు చేశారు.
విద్యకు చంద్రబాబు తన ప్రభుత్వ హయాంలో రూ.24,889 కోట్లు కేటాయిస్తే, జగన్ రూ.55,610 కోట్లు కేటాయించారు. వైద్యానికి చంద్రబాబు రూ. 31,276 కోట్లు కేటాయిస్తే, జగన్ రూ.78,410 కోట్లు కేటాయించారు. ఇలా చెప్పుకుంటే పోతే అనేకం ఉన్నాయి. సంక్షేమాన్ని, అభివృద్ధిని జగన్ జోడు గుర్రాల్లా పరుగెత్తించారు. చంద్రబాబు చేసిందేమిటని ప్రశ్నించుకుంటే జవాబు చెప్పడం చాలా కష్టం.
చంద్రబాబు ప్రస్తుతం ఇస్తున్న హామీలు కూడా తక్కువేమీ లేవు. జగన్ అమలు చేస్తున్న పథకాల సొమ్మును పెంచుతానని చెప్పుతున్నారు. తాను అమలు చేసే పథకాలను శ్రీకాకుళం కార్యక్రమంలోనూ వల్లె వేశారు. తాను అధికారంలోకి వస్తే అమ్మకు వందనం కింద ప్రతి బిడ్డకు రూ.15 వేల చొప్పున ఇస్తానని చెప్పారు. డ్వాక్రా సంఘాలకు రూ,10 లక్షల ఆర్థిక సాయం చేస్తానని హామీ ఇచ్చారు. వడ్డీలేని రుణాలు అందిస్తామని కూడా చెప్పారు. ఇలా తాను ఎవరికి ఎంత ఇస్తాననే విషయాలను చెప్పుకుంటూ వెళ్లారు. ఈ పథకాల అమలుకు చంద్రబాబు డబ్బులు ఎక్కడి నుంచి తెస్తారు? ఇచ్చిన హామీలను అమలు చేసే గుణం చంద్రబాబుకు లేదు కాబట్టి ఎన్నయినా చెప్పుతారు.