జబర్దస్త్ ఎమ్మెల్యే.. రోజాపై చంద్రబాబు సెటైర్లు
మంత్రిగా రోజా పనితీరుపై కాకుండా వ్యక్తిగత విమర్శలు చేయడం విశేషం. జబర్దస్త్ ఎమ్మెల్యే అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు కూడా మండిపడుతున్నారు.
ప్రజాగళం యాత్రలో భాగంగా నగరి నియోజకవర్గంలో పర్యటించిన చంద్రబాబు స్థానిక ఎమ్మెల్యే, మంత్రి రోజాపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆమె జబర్దస్త్ ఎమ్మెల్యే అంటూ సెటైర్లు పేల్చారు. జబర్దస్త్ ఎమ్మెల్యే తన సొంత నియోజకవర్గానికి ఏమీ చేయలేదని విమర్శించారు. మున్సిపాలిటీలో పదవి ఇప్పిస్తామని చెప్పి రూ.40 లక్షలు తీసుకుని సొంత పార్టీ నాయకుల్నే రోజా మోసం చేశారని ఆరోపించారు. నగరి నియోజకవర్గంలో అడుగడుగునా అరాచకం రాజ్యమేలుతోందని అన్నారు.
చంద్రబాబు, రోజా మధ్య మాటల తూటాలు ఇప్పటివి కావు. తనను రాజకీయంగా ఇబ్బందులు పెట్టారంటూ చంద్రబాబుపై గతంలో రోజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ముద్దపప్పు, సుద్దపప్పు అంటూ తండ్రీ కొడుకులిద్దరికీ కౌంటర్లిచ్చేవారు రోజా. వైసీపీ తరపున చంద్రబాబుపై ఎక్కుపెట్టే విమర్శల్లో ఎక్కువశాతం రోజా నుంచి వచ్చే వాగ్బాణాలే ఉండేవి. ఇప్పుడు చంద్రబాబు నగరికి వచ్చి ఆమెకు కౌంటర్లిచ్చారు. రోజా పాలనపై విమర్శలు చేయకుండా వ్యక్తిగత విమర్శలు చేయడం విశేషం. జబర్దస్త్ ఎమ్మెల్యే అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు కూడా మండిపడుతున్నారు. రోజా మంత్రి పదవి చేపట్టిన తర్వాత జబర్దస్త్ షో ఆపేశారు. ఇప్పటి వరకూ టీవీ షో ల జోలికి వెళ్లలేదు. అయినా కూడా చంద్రబాబు రోజాని టార్గెట్ చేసినట్టు మాట్లాడటంతో సోషల్ మీడియాలో చంద్రబాబుపై ట్రోలింగ్ మొదలైంది.
నగరి టీడీపీ అభ్యర్థి భాను ప్రకాష్, ప్రజలు మెచ్చిన నాయకుడని అన్నారు చంద్రబాబు. ప్రజలు కోరడంతోనే ఆయనకు టికెట్ ఇచ్చానని వివరించారు. గాలి ముద్దుకృష్ణమ నాయుడుని తలపించేలా ఆయన తనయుడు భాను ప్రకాష్ ప్రజా సేవ చేస్తారని అన్నారు. ఇక నగరికి సంబంధించి పలు హామీలు గుప్పించారు చంద్రబాబు. పవర్ లూమ్ మగ్గాలకు, చేనేత కార్మికులకు ఉచిత కరెంటు ఇస్తామని చెప్పారు. నిండ్ర షుగర్ ఫ్యాక్టరీ తిరిగి రైతులకు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. నగరిలో పారిశ్రామిక వాడను తీసుకొస్తామని, టెక్స్ టైల్ పార్క్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు చంద్రబాబు.