Telugu Global
Andhra Pradesh

వైసీపీకి 11 సీట్లు ఎందుకొచ్చాయంటే..? చంద్రబాబు సెటైర్

వైసీపీకి వచ్చిన 11 నెంబర్ ని కూటమి నేతలెవరూ ఇప్పటి వరకూ ఎగతాళి చేయలేదు. తొలిసారిగా చంద్రబాబు ఆ 11 సీట్ల వెనక ఉన్న సీక్రెట్ ఇదీ అంటూ వెటకారం చేశారు.

వైసీపీకి 11 సీట్లు ఎందుకొచ్చాయంటే..? చంద్రబాబు సెటైర్
X

2019లో టీడీపీకి వచ్చిన సీట్లు కేవలం 23. అప్పట్లో ఆ నెంబర్ పై వైసీపీ ఓ రేంజ్ లో జోకులు పేల్చింది. అంతకు ముందు వైసీపీ నుంచి చంద్రబాబు లాక్కున్న ఎమ్మెల్యేల సంఖ్య 23 అని, అందుకే ఆయనకు దేవుడు 23మందిని మిగిల్చారని అన్నారు. ఎన్నికలు జరిగిన తేదీ, ఫలితాలు వచ్చిన తేదీ, నారా లోకేష్ బర్త్ డే.. ఇలా రకరకాల పోలికలు పెడుతూ ఆ 23 నెంబర్ ని చీల్చి చెండాడారు. ఇప్పుడు టీడీపీ వంతు వచ్చింది. విచిత్రం ఏంటంటే.. వైసీపీకి వచ్చిన 11 నెంబర్ ని కూటమి నేతలెవరూ ఇప్పటి వరకూ ఎగతాళి చేయలేదు. తొలిసారిగా చంద్రబాబు ఆ 11 సీట్ల వెనక ఉన్న సీక్రెట్ ఇదీ అంటూ వెటకారం చేశారు.


ఇటీవల పోలవరం పర్యటన అనంతరం ప్రాజెక్ట్ ఆలస్యానికి జగన్ కారణం అంటూ విమర్శించారు చంద్రబాబు. ఈరోజు అమరావతి నిర్మాణాలను పరిశీలించారాయన. సీఆర్డీఏ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన చంద్రబాబు వైసీపీకి వచ్చిన సీట్లపై సెటైర్లు పేల్చారు. అమరావతి రైతులు రాజధానికోసం 1631 రోజులు ఆందోళన చేశారని, ఆ అంకెలన్నీ కలిపితే 11 అవుతుందని, వైసీపీకి వచ్చిన సీట్లు ఆ పదకొండేనని అన్నారు చంద్రబాబు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రాజధాని పూర్తవుతుందనే నమ్మకంతో రైతులు పోరాటాన్ని విరమించారన్నారు. ఏపీ అంటే అమరావతి, పోలవరం అని అర్థం చెప్పారు చంద్రబాబు.

పోలవరం పూర్తయితే రాష్ట్రం మొత్తానికి నీరు వస్తుందనే ఉద్దేశంతో దానిని పూర్తి చేసేందుకు ప్రాధాన్యత ఇచ్చామన్నారుచంద్రబాబు. కానీ వైసీపీ పోలవరాన్ని గోదాట్లో కలిపేసిందన్నారు. రాష్ట్రానికి వరంగా మారాల్సిన పోలవరం శాపంగా మారిందన్నారాయన. కూటమికి చరిత్రలో ఎన్నడూ కనీవినీ ఎరుగని విజయాన్ని ప్రజలు కట్టబెట్టారని, వైసీపీ కేవలం 11 సీట్లకే పరిమితం అయిందన్నారు. ప్రజావేదిక కూల్చివేత వ్యవహారంపై కూడా చంద్రబాబు ధ్వజమెత్తారు. హిరోషిమా, నాగసాకిని స్ఫూర్తిగా తీసుకొని జగన్‌ చేసిన విధ్వంసానికి గుర్తుగా ప్రజావేదిక శిథిలాలను అలాగే ఉంచుతామన్నారు చంద్రబాబు. గత ముఖ్యమంత్రులు చేతనైతే అభివృద్ధి చేశారని, లేకపోతే ఊరుకున్నారని.. కానీ జగన్ లా విధ్వంసం చేయలేదన్నారు. జగన్ రాజకీయాలకు పనికిరాని వ్యక్తి అని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు చంద్రబాబు.

First Published:  20 Jun 2024 8:40 PM IST
Next Story