Telugu Global
Andhra Pradesh

నేను 18 గంటలు పనిచేస్తా.. నువ్వు గంట చేస్తే చాలు

ఒక రాజధానిని నాశనం చేసి 3 రాజధానులు అంటున్నారని, మన రాజధాని ఏదంటే చెప్పుకోలేని దుస్థితిలో ఉన్నామని ఎద్దేవా చేశారు. పరదాల మాటున పర్యటించడం కాదని, ధైర్యం ఉంటే జగన్ ప్రజల్లోకి రావాలన్నారు చంద్రబాబు.

నేను 18 గంటలు పనిచేస్తా.. నువ్వు గంట చేస్తే చాలు
X

‘సాగునీటి ప్రాజెక్టుల సందర్శన’ కార్యక్రమంలో భాగంగా నంద్యాల జిల్లాలోని నందికొట్కూరులో పర్యటించారు చంద్రబాబు. నందికొట్కూరులో భారీ ర్యాలీ నిర్వహించారు. వాహనంపైనుంచి ప్రసంగించిన చంద్రబాబు హుషారుగా అటు ఇటు కదులుతూ మాట్లాడారు. తాను రోజుకి 18గంటలు పనిచేస్తానని చెప్పుకొచ్చారు. సీఎం జగన్ రోజుకి గంటసేపు పనిచేయలరా అని ప్రశ్నించారు. సాయంత్రం 6 తర్వాత ఆయన కనపడరని, తాను రాత్రంతా పనిచేసినా కూడా ఉదయానికి అలసిపోనన్నారు. వయసు తనకొక నెంబర్ మాత్రమేనంటున్న చంద్రబాబు.. తనను విమర్శించేవాళ్లు పుట్టుకతో వృద్ధులని మండిపడ్డారు.


జగన్ పాలనలో నియోజకవర్గానికో సైకో పుట్టుకొస్తున్నారని, రౌడీయిజం చేస్తే తాటతీస్తానని.. వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు చంద్రబాబు. జగన్ రాయలసీమకు ద్రోహం చేశారని చెప్పారు. బటన్‌ నొక్కుడు కాస్తా, ఇప్పుడు బటన్ బుక్కుడుగా మారిపోయిందని.. రాష్ట్రంలో అన్ని చార్జీలు పెంచేశారని విద్యుత్ చార్జీలు ఇప్పటికే 8సార్లు పెంచారని విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చాక నూతన విద్యుత్ పాలసీ తెస్తామన్నారు. విద్యుత్‌ ఛార్జీలు తగ్గించే బాధ్యత తనదేనని హామీ ఇచ్చారు చంద్రబాబు.

లోకేష్ చేపట్టిన యువగళం సూపర్‌ హిట్‌ అయిందని, యువతలో చైతన్యం వచ్చిందని చెప్పుకొచ్చారు చంద్రబాబు. టీడీపీ అధికారంలోకకి వచ్చాక 20 లక్షల కంటే ఎక్కువ ఉద్యోగాలు ఇస్తామన్నారు. జాబు రావాలంటే.. బాబు రావాల్సిందేనన్నారు. నాసిరకం మద్యం సరఫరాతో వైసీపీ ప్రభుత్వం పేదల రక్తం తాగుతోందని.. పాతమద్యం విధానం తెచ్చి ధరలు తగ్గిస్తామని హామీ ఇచ్చారు.

సాగునీటి ప్రాజెక్ట్ లపై తాను యుద్ధభేరి ప్రకటించేందుకు వచ్చానని చెప్పారు చంద్రబాబు. ప్రాజెక్టుల్లో నీళ్లు లేకుండా చేసిన ఘనత జగన్‌ ది అని అన్నారు. ఒక రాజధానిని నాశనం చేసి 3 రాజధానులు అంటున్నారని, మన రాజధాని ఏదంటే చెప్పుకోలేని దుస్థితిలో ఉన్నామని ఎద్దేవా చేశారు. పరదాల మాటున పర్యటించడం కాదని, ధైర్యం ఉంటే జగన్ ప్రజల్లోకి రావాలన్నారు చంద్రబాబు.

First Published:  1 Aug 2023 3:53 PM IST
Next Story