అక్టోబర్ 5 వరకు చంద్రబాబు రిమాండ్ పొడిగింపు
విచారణ చేపట్టిన న్యాయస్థానం రిమాండ్ పొడిగిస్తూ ఆదేశాలిచ్చింది. విచారణ సందర్భంగా తొలుత చంద్రబాబును న్యాయమూర్తి పలు ప్రశ్నలు అడిగారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి రిమాండ్‌ను పొడిగిస్తూ ఏసీబీ కోర్టు ఆదేశాలిచ్చింది. తొలుత విధించిన రిమాండ్ గడువు నేటితో (24వ తేదీ ఆదివారం సాయంత్రంతో) ముగియగా, చంద్రబాబును సీఐడీ అధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు ఎదుట హాజరుపరిచారు. ఈ సందర్భంగా సీఐడీ అధికారులు ఈ కేసులో చంద్రబాబుకు రిమాండ్ పొడిగించాలని కోరారు. అలాగే ఆయన్ని మరిన్ని రోజులు కస్టడీకి ఇవ్వాలని న్యాయమూర్తిని కోరారు. ఈ మేరకు రిమాండ్ పొడిగింపు, కస్టడీ పిటిషన్లను న్యాయస్థానంలో దాఖలు చేశారు.
దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం రిమాండ్ పొడిగిస్తూ ఆదేశాలిచ్చింది. విచారణ సందర్భంగా తొలుత చంద్రబాబును న్యాయమూర్తి పలు ప్రశ్నలు అడిగారు. మీకు వైద్య పరీక్షలు నిర్వహించారా..? కస్టడీలో మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టారా..? అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా చంద్రబాబు స్పందిస్తూ వైద్యపరీక్షలు నిర్వహించారని, విచారణలో ఇబ్బంది పెట్టలేదని సమాధానమిచ్చారు.