టీడీపీ మూడో జాబితా.. 13 ఎంపీ, 11 అసెంబ్లీ టికెట్లు ప్రకటన
మైలవరం టికెట్ రేసులో దేవినేని ఉమా ఔటయ్యారు. తాజా జాబితాలో ఇక్కడి నుంచి వైసీపీ నుంచి వచ్చి చేరిన వసంత కృష్ణప్రసాద్‌కు టీడీపీ టికెట్ ఖరారు చేసింది.
ఏపీలో సార్వత్రిక ఎన్నికల కోసం టీడీపీ మూడో జాబితా ప్రకటించింది. 13 లోక్‌సభ, 11 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. పొత్తులో భాగంగా టీడీపీ 144 అసెంబ్లీ, 17 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేస్తోంది. మూడో జాబితాతో కలిపి మొత్తం 139 అసెంబ్లీ స్థానాలకు, 13 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఇంకా 5 అసెంబ్లీ, 4 లోక్‌సభ టికెట్ల ప్రకటించాల్సి ఉంది.
ఉమాకు షాక్.. సోమిరెడ్డికి సీటు
మైలవరం టికెట్ రేసులో దేవినేని ఉమా ఔటయ్యారు. తాజా జాబితాలో ఇక్కడి నుంచి వైసీపీ నుంచి వచ్చి చేరిన వసంత కృష్ణప్రసాద్‌కు టీడీపీ టికెట్ ఖరారు చేసింది. పెనమలూరులో టికెట్ తెచ్చుకుని బోడె ప్రసాద్ పంతం నెగ్గించుకున్నారు. దీంతో ఉమాకు ఇక సీటు లేనట్లే. మాజీ మంత్రి సోమిరెడ్డికి సర్వేపల్లిలో సీటు ఇవ్వనని ఇన్నాళ్లూ వెనక్కి తగ్గినా చివరికి ఆయనకే అవకాశం ఇచ్చారు..
వాళ్లిద్దరికే సీటు
పలాసలో వైరి వర్గం వ్యతిరేకించినా గౌతు శిరీషకే సీటు దక్కింది. శృంగవరపు కోటలోనూ ప్రత్యర్థి వర్గాన్ని దాటుకుని మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి టికెట్ సాధించగలిగారు. చీరాలలో గత ఎన్నికలో గెలిచిన కరణం బలరామ్ వైసీపీలోకి వెళ్లిపోవడంతో అక్కడ అభ్యర్థి కోసం ఎంత వెతికినా ఫలితం లేకపోయింది. చివరకు తాత్కాలిక ఇన్‌ఛార్జిగా తెరపైకి తెచ్చిన ఎం.ఎం. కొండయ్య యాదవ్‌నే అభ్యర్థిగా ప్రకటించాల్సి వచ్చింది.