Telugu Global
Andhra Pradesh

ప‌వ‌న్ సైకిల్ గుర్తుపైనే పోటీ చేస్తారా?

చంద్రబాబు చెప్పినట్లుగా కామన్ సింబల్ మీద రెండు పార్టీలు పోటీ చేస్తే జనసేన అస్తిత్వాన్ని కోల్పోవటం ఖాయమనే ఆందోళన మొదలైందని సమాచారం.

ప‌వ‌న్ సైకిల్ గుర్తుపైనే పోటీ చేస్తారా?
X

ప‌వ‌న్ సైకిల్ గుర్తుపైనే పోటీ చేస్తారా?

రాబోయే ఏపీ ఎన్నికల్లో టీడీపీ సైకిల్ గుర్తు మీదే జనసేన కూడా పోటీ చేయబోతోందా? అవుననే అంటున్నది జగన్మోహన్ రెడ్డి మీడియా. జైలు నుండి బెయిల్‌పై రిలీజైన చంద్రబాబును ఇటలీ నుండి తిరిగొచ్చిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ కలిశారు. పవన్‌తో నాదెండ్ల మనోహర్ కూడా ఉన్నారు. వీళ్ళభేటీ సందర్భంగా జనసేన అభ్యర్థులందరినీ సైకిల్ గుర్తుమీదే పోటీచేయాలని చంద్రబాబు ప్రతిపాదించినట్లు సదరు మీడియా చెప్పింది. ఎందుకంటే జనాల్లో జనసేన గుర్తు గాజు గ్లాసు అంతగా పాపురల్ కాలేదు కాబట్టి.

అంతేకాకుండా కామన్ సింబల్ అనే ప్రాబ్లెమ్ కూడా ఉంది కాబట్టే ఎన్నికల్లో చాలా సమస్యలు వస్తాయని చంద్రబాబు చెప్పారట. జనసేన అభ్యర్ధుల్లోనే ఒక్కో నియోజకవర్గంలో ఒక్కో గుర్తుపై పోటీచేస్తే ఓటర్లు అయోమయానికి గురవుతారని వివరించారట. ప్రచారం చేయటం కూడా చాలా ఇబ్బందిగా ఉంటుందని చెప్పారట. 1983లో టీడీపీతో కలిసి మేనకా గాంధీ నాయకత్వంలోని సంజయ్ విచార్ మంచ్ సైకిల్ గుర్తుమీదే పోటీచేసిన విషయాన్ని గుర్తుచేశారట.

సైకిల్ గుర్తుమీదే విచార్ మంచ్ పోటీచేసినా, గెలిచిన నలుగురు ఎమ్మెల్యేలు విచార్ మంచ్ పార్టీ బ్యానర్ కిందనే కంటిన్యూ అయినట్లు చెప్పారని చెప్పింది. అసెంబ్లీలో గెలిచినవాళ్ళంతా సాంకేతికంగా టీడీపీ ఎమ్మెల్యేలుగానే ఉన్నప్పటికీ పార్టీలపరంగా మాత్రం ఎవరి అజెండా వాళ్ళదిగానే ఉండచ్చని కూడా పవన్‌కు చంద్రబాబు సూచించినట్లు చెప్పింది. చంద్రబాబు చెప్పింది బాగానే ఉంది కానీ ఆచరణలో మాత్రం సాధ్యంకాదన్న అనుమానాలు పవన్‌లో బయలుదేరాయట. చంద్రబాబు సూచనపైన జనసేనలో గందరగోళం మొదలైనట్లు చెప్పింది.

రెండు పార్టీలు సైకిల్ గుర్తు మీదే పోటీ చేస్తే టీడీపీలో జనసేన విలీనమైనట్లే అన్న అభ్యంతరాలు జనసేనలో మొదలయ్యాయట. జనసేనకు కామన్ సింబల్ లేదు అన్న ఏకైక కారణంతోనే చంద్రబాబు ఈ ప్రతిపాదన చేసినట్లు పవన్ వివరించినా జనసేన నేతలు పూర్తిగా కన్వీన్స్ కావటంలేదట. చంద్రబాబు చెప్పినట్లుగా కామన్ సింబల్ మీద రెండు పార్టీలు పోటీ చేస్తే జనసేన అస్తిత్వాన్ని కోల్పోవటం ఖాయమనే ఆందోళన మొదలైందని సమాచారం. మరీ ప్రతిపాదన ఎంతవరకు నిజం? దీనికి పవన్ ఎంతవరకు ఆమోదిస్తారో చూడాలి.


First Published:  5 Nov 2023 10:45 AM IST
Next Story